IND vs ENG Semi final: రివేంజ్ తీర్చుకోవాలనే కసితో భారత్.. ఇంగ్లండ్‍కు వాన భయం: సెమీస్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
26 June 2024, 21:24 IST
- IND vs ENG T20 World Cup 2024 Semi Final: టీ20 ప్రపంచకప్ సెమీస్ సమరానికి భారత్ సిద్ధమైంది. ఇంగ్లండ్‍పై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఫైనల్ చేరాలని కసితో ఉంది. మరోవైపు ఇంగ్లిష్ జట్టులో వర్షం భయం నెలకొంది. వివరాలివే..
IND vs ENG Semi final: రివేంజ్ తీర్చుకోవాలనే కసితో భారత్.. ఇంగ్లండ్‍కు వాన భయం: సెమీస్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీ సెమీఫైనల్స్ సమరానికి సమయం ఆసన్నమైంది. సెమీస్ పోరులో ఇంగ్లండ్‍తో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అజేయంగా దూసుకుపోతున్న భారత్ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. గయానా వేదికగా గురువారం (జూన్ 27) భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్ పోరు జరగనుంది. గత ఎడిషన్‍లో దెబ్బ కొట్టిన ఇంగ్లండ్‍పై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఫైనల్ చేరాలని రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ కసిగా ఉంది. విన్నింగ్ ఫామ్ కొనసాగించాలనే జోష్‍తో ఉంది.
రివేంజ్ తీర్చుకుంటుందా..
2022 టీ20 ప్రపంచకప్‍లో భారత్‍ను ఇంగ్లండ్ దెబ్బకొట్టింది. ఆడిలైడ్ వేదికగా జరిగిన సెమీఫైనల్‍లో ఇంగ్లిష్ జట్టు చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సెమీస్ ఓటమితో నిరాశగా ఇంటి బాటపట్టింది. అయితే, ఆ ఓటమికి ఇప్పుడు కసితీరా బదులిచ్చే అవకాశం భారత్ ముందుకు వచ్చింది. ఇప్పటి 2024 ప్రపంచకప్ సెమీస్‍లో ఇంగ్లండ్‍ను చిత్తు చేసి ఆ జట్టుపై రివేంజ్ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అలాగే, మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‍కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది.
వర్షం ముప్పు.. ఇంగ్లండ్‍కు వణుకు
భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్ జరిగే గురువారం (జూన్ 27) గయానాలో వాన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు 88 శాతం ఉన్నాయని వాతావరణ అంచనాలు ఉన్నాయి. ఈ పోరుకు వర్షం ఆటంకాలు కలిగించే ఛాన్స్ ఉంది. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది. సూపర్-8 గ్రూప్1లో టాప్‍లో నిలిచి సెమీస్‍కు టీమిండియా వచ్చింది. గ్రూప్-2లో రెండోస్థానంతో ఇంగ్లండ్ అర్హత సాధించింది. దీంతో ఒకవేళ సెమీస్ రద్దయితే టీమిండియా ఫైనల్ చేరుతుంది. దీంతో ఇంగ్లండ్ జట్టులో వర్షం భయం ఉంది. వాన పడకూడదని ఆ జట్టు కోరుకుంటోంది. ఈ సెమీస్‍కు రిజర్వ్ డే సదుపాయం లేదు.
మ్యాచ్ టైమింగ్ ఇదే
భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ గయానాలోని ప్రోవిడన్స్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం (జూన్ 27) రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అర గంట ముందు టాస్ పడుతుంది.
లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడ?
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఈ సెమీఫైనల్ మ్యాచ్‍ను స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
సూపర్-8లో తన చివరి మ్యాచ్‍లో ఆస్ట్రేలియాను ఓడించి ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది భారత్. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు సెమీస్‍లో ఇంగ్లండ్‍ను ఓడించి 2022 ఎడిషన్ రివేంజ్ తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.
ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‍ల్లో 2007, 2014ల్లో మాత్రమే భారత్ ఫైనల్ చేరింది. 2007లో టైటిల్ సాధిస్తే.. 2014లో తుదిపోరులో ఓడి రన్నరప్‍గా నిలిచింది. సెమీస్‍లో గెలిచి ఇప్పుడు మూడోసారి ఫైనల్ చేరాలని ఆశిస్తోంది.
మరో సెమీస్
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ తొలి సెమీఫైనల్‍లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ట్రినిడాడ్‍లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం (జూన్ 27) ఉదయం 6 గంటలకే మొదలుకానుంది. అయితే, వాన పడితే తొలి సెమీస్‍కు మాత్రం రిజర్వ్ డే సదుపాయం ఉంది.
టాపిక్