తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng: మళ్లీ విజృంభించిన యశస్వి జైస్వాల్.. రెండో డబుల్ సెంచరీ బాదేసిన యంగ్ స్టార్.. ఇంగ్లండ్‍ ముందు కొండంత టార్గెట్

IND vs ENG: మళ్లీ విజృంభించిన యశస్వి జైస్వాల్.. రెండో డబుల్ సెంచరీ బాదేసిన యంగ్ స్టార్.. ఇంగ్లండ్‍ ముందు కొండంత టార్గెట్

18 February 2024, 14:03 IST

google News
    • IND vs ENG 3rd Test - Yashasvi Jaiswal: భారత యువ స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుత బ్యాటింగ్‍తో అదరగొట్టాడు. వరుసగా రెండో డబుల్ సెంచరీతో విజృంభించాడు. దీంతో మూడో టెస్టులో ఇంగ్లండ్‍కు కొండంత టార్గెట్ ఇచ్చింది భారత్. 
మళ్లీ విజృంభించిన యశస్వి జైస్వాల్.. రెండో డబుల్ సెంచరీ బాదేసిన యంగ్ స్టార్.. ఇంగ్లండ్‍ ముందు కొండంత టార్గెట్
మళ్లీ విజృంభించిన యశస్వి జైస్వాల్.. రెండో డబుల్ సెంచరీ బాదేసిన యంగ్ స్టార్.. ఇంగ్లండ్‍ ముందు కొండంత టార్గెట్ (REUTERS)

మళ్లీ విజృంభించిన యశస్వి జైస్వాల్.. రెండో డబుల్ సెంచరీ బాదేసిన యంగ్ స్టార్.. ఇంగ్లండ్‍ ముందు కొండంత టార్గెట్

IND vs ENG 3rd Test - Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ సెన్సేషన్ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ మరోసారి విజృంభించాడు. తన కెరీర్లో ఏడో టెస్టులోనే రెండో డబుల్ సెంచరీతో ఈ 22 ఏళ్ల స్టార్ అదరగొట్టాడు. ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో వరుసగా రెండో ద్విశతకంతో సత్తాచాటాడు యశస్వి. రాజ్‍కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు భారత రెండో ఇన్నింగ్స్‌లో 236 బంతుల్లోనే ఏకంగా 12 సిక్సర్లు, 14 ఫోర్లతో అజేయంగా 214 పరుగులు చేశాడు జైస్వాల్. శతకం తర్వాత మూడో రోజు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి జైస్వాల్.. నేడు (ఫిబ్రవరి 18) నాలుగో రోజు మళ్లీ బరిలోకి దిగి వీర విహారం చేశాడు. డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.

యశస్వి జైస్వాల్ ద్విశతకంతో విజృభించడంతో పాటు శుభ్‍మన్ గిల్ (91 పరుగులు), సర్ఫరాజ్ ఖాన్ (72 బంతుల్లో 68 పరుగులు; నాటౌట్) అర్ధశకతకాలతో రాణించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా 4 వికెట్లకు 430 వద్ద నాలుగో రోజైన నేడు రెండో సెషన్‍లో డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్‍కు ఏకంగా 557 పరుగుల కొండంత టార్గెట్ ఇచ్చింది. దాదాపు ఈ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే. నేడు ఇంకా 43 ఓవర్ల ఆట జరగాల్సి ఉండగా.. ఐదో రోజు కూడా ఆడాల్సి ఉండటంతో ఇంగ్లండ్ డ్రా చేసుకోవడం కూడా చాలా కష్టం. దీంతో టీమిండియా ఈ మూడో టెస్టుపై పూర్తిగా పట్టు సాధించింది.

అరంగేట్రం చేసిన టెస్టులోనే భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌ల్లో అర్ధ శతకాలతో అదరగొట్టాడు. తనపై పెట్టుకున్న అంచనాలను పూర్తిస్థాయిలో నిలబెట్టుకున్నాడు. టెస్టు అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా సర్ఫరాజ్ నిలిచాడు.

చరిత్ర సృష్టించిన జైస్వాల్

ఇంగ్లండ్‍పై టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు తొలి భారత ఆటగాడిగా యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్‍లో రెండో మ్యాచ్‍లో డబుల్ సెంచరీతో సత్తాచాటిన జైస్వాల్.. ఇప్పుడు మూడో టెస్టులోనూ అదే రిపీట్ చేశాడు. దీంతో వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ తర్వాత టెస్టుల్లో వరస మ్యాచ్‍ల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్‌గానూ రికార్డులకెక్కాడు.

రనౌట్‍తో గిల్ సెంచరీ మిస్

196 పరుగులకు 2 వికెట్ల వద్ద నాలుగో రోజు ఆటకు భారత్ బరిలోకి దిగింది. శుభ్‍మన్ గిల్, కుల్‍దీప్ యాదవ్ బ్యాటింగ్ కొనసాగించారు. అయితే, శుభ్‍మన్ గిల్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో రనౌట్ అయ్యాడు. వేగంగా పరుగులు చేస్తూ దూకుడు చూపిన గిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కుల్‍దీప్ పరుగుకు పిలిచి వెనక్కి పంపడంతో గిల్‍ను దురదృష్టం వెంటాడింది. దీంతో 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌటై చాలా నిరాశగా పెవిలియన్‍కు చేరాడు గిల్. ఆ తర్వాత కాసేపటికే కుల్దీప్ కూడా ఔటయ్యాడు.

యశస్వి హ్యాట్రిక్స్ సిక్సర్లు

ముందు రోజు సెంచరీ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగన యశస్వి జైస్వాల్ నాలుగో రోజు 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్‍కు దిగాడు. ఆరంభం నుంచే ఎడాపెడా హిట్టింగ్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా దుమ్మురేపాడు. ఈ ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేసిన ఓ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది ఔరా అనిపించాడు యశస్వి జైస్వాల్. 231 బంతుల్లోనే డబుల్ సెంచరీకి చేరాడు జైస్వాల్. తన కెరీర్లో ఏడో టెస్టులోనే రెండో ద్విశకతంతో చెలరేగాడు. జోరు చూపిన సర్ఫరాజ్ ఖాన్ 65 బంతుల్లో అర్ధ శతకం చేరాడు. కాసేపటికే 430 పరుగుల స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేశాడు రోహిత్ శర్మ. దీంతో ఇంగ్లండ్ ముందు 557 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

ఈ ఐదు టీ20 సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍ల్లో చెరొకటి గెలిచాడు భారత్, ఇంగ్లండ్. దీంతో 1-1తో సిరీస్ సమంగా ఉంది. ప్రస్తుతం ఈ మూడో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. దాదాపు ఈ మ్యాచ్ గెలిచే స్థితికి చేరింది.

తదుపరి వ్యాసం