తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 1st Test: ఇంగ్లండ్‌కు టీమిండియా స్పిన్ ఉచ్చు.. బెన్ స్టోక్స్ పోరాటంతో మంచి స్కోరు చేసిన ఇంగ్లిష్ టీమ్

Ind vs Eng 1st Test: ఇంగ్లండ్‌కు టీమిండియా స్పిన్ ఉచ్చు.. బెన్ స్టోక్స్ పోరాటంతో మంచి స్కోరు చేసిన ఇంగ్లిష్ టీమ్

Hari Prasad S HT Telugu

25 January 2024, 15:10 IST

google News
    • Ind vs Eng 1st Test: ఇంగ్లండ్ కు టీమిండియా స్పిన్ ఉచ్చు బిగించినా.. బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీతో ఆ టీమ్ మంచి స్కోరే సాధించింది. హైదరాబాద్ పిచ్ తొలి రోజే స్పిన్ కు అనుకూలించింది.
ఇండియన్ క్రికెట్ టీమ్
ఇండియన్ క్రికెట్ టీమ్ (PTI)

ఇండియన్ క్రికెట్ టీమ్

India vs England Live Score: ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ తొలి రోజే రంజుగా మొదలైంది. ఇంగ్లండ్ బజ్‌బాల్ కు టీమిండియా స్పిన్ సవాలు విసిరింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ తొలి రోజే 246 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్ బెన్ స్టోక్స్ (70) హాఫ్ సెంచరీతో ఛాలెంజింగ్ పిచ్ పై కూడా ఇంగ్లిష్ టీమ్ మంచి స్కోరే సాధించడం విశేషం. ముందు చెప్పినట్లే వరుసగా వికెట్లు పడుతున్నా.. ఇంగ్లండ్ మాత్రం తమ అటాకింగ్ షాట్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది.

అశ్విన్, జడేజా మ్యాజిక్

ఊహించినట్లే ఇంగ్లండ్ బజ్‌బాల్ స్టైల్ కు ఇండియా స్పిన్ తోనే సమాధానమిచ్చింది. అశ్విన్, జడేజా ద్వయం మరోసారి మ్యాజిక్ చేసింది. ఈ ఇద్దరూ చెరో మూడు వికెట్లతో ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ టీమ్ తొలి సెషన్ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్ ను 3 వికెట్లకు 108 పరుగుల దగ్గర ముగించింది.

రెండో సెషన్ లో మన స్పిన్నర్లు మరింత చెలరేగారు. లంచ్ నుంచి టీ వరకూ ఐదు వికెట్లు తీశారు. అయితే ఇంగ్లండ్ సీనియర్లు జో రూట్ (29), జానీ బెయిర్‌స్టో (37)తోపాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ అటాకింగ్ తో ఇండియా బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను నాలుగో వికెట్ కు 61 పరుగులు జోడించిన రూట్, బెయిర్ స్టో ఆదుకున్నారు.

బెన్ స్టోక్స్ అటాకింగ్

ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ బెన్ స్టోక్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ బ్యాటింగ్ కు అంత అనుకూలంగా లేకపోయినా.. బౌలర్లను అటాక్ చేస్తూ అతడు భారీ షాట్లు ఆడాడు. దీంతో ఇంగ్లండ్ ఓవైపు వికెట్లు కోల్పోతున్నా.. స్కోరు బోర్డు మాత్రం ఎక్కడా ఆగలేదు. డిఫెన్స్ కు తమకు అర్థమే తెలియదన్నట్లు స్పిన్ బౌలింగ్ లోనూ ఇంగ్లండ్ దీటుగానే ఆడుతూ వచ్చింది.

నిజానికి తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ చేసిన 246 పరుగులను అంత తక్కువ చేయలేం. తొలి రోజే స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ టీమిండియాకు కూడా సవాలే. ఇంగ్లండ్ జట్టులోనూ ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఇండియా తరఫున అశ్విన్ 3, జడేజా 3, అక్షర్ 2.. మొత్తం 8 వికెట్లు స్పిన్నర్లే తీయడం చూస్తుంటే.. ఇంగ్లండ్ స్పిన్నర్లకు కూడా పిచ్ నుంచి సహకారం లభించడం ఖాయం.

అందులోనూ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ ఆడింది. ఈ లెక్కన ఇండియా చివర్లో చేజింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లోనే జాగ్రత్తగా ఆడి మంచి లీడ్ సాధించగలిగితేనే మ్యాచ్ పై పట్టు లభిస్తుంది.

తదుపరి వ్యాసం