తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus: భారత్‍దే సిరీస్.. రాణించిన స్పిన్నర్లు

IND vs AUS: భారత్‍దే సిరీస్.. రాణించిన స్పిన్నర్లు

01 December 2023, 22:50 IST

google News
    • IND vs AUS 4th T20I: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. నేడు జరిగిన నాలుగో మ్యాచ్‍లో గెలిచి 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను పక్కా చేసకుకుంది. ఆ వివరాలివే.. 
IND vs AUS: భారత్‍దే సిరీస్.. రాణించిన స్పిన్నర్లు
IND vs AUS: భారత్‍దే సిరీస్.. రాణించిన స్పిన్నర్లు (PTI)

IND vs AUS: భారత్‍దే సిరీస్.. రాణించిన స్పిన్నర్లు

IND vs AUS 4th T20I: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో ఎదురుదెబ్బ కొట్టిన ఆస్ట్రేలియాను.. ఆ టోర్నీ తర్వాత జరుగుతున్న టీ20 సిరీస్‍లో భారత్ చిత్తుచేస్తోంది. ఐదు టీ20ల సిరీస్‍లో భాగంగా నేడు (డిసెంబర్ 1) జరిగిన నాలుగో మ్యాచ్‍లో గెలిచి 3-1తో సిరీస్‍ను టీమిండియా దక్కించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను పక్కా చేసుకుంది. రాయ్‍పూర్ వేదికగా నేడు జరిగిన నాలుగో టీ20లో భారత్ 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. సీనియర్ల గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టు అదరగొట్టి సిరీస్ కైవసం చేసుకుంది.

భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (3/16), రవి బిష్ణోయ్ (1/17) ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించారు. 175 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ 4 ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. రవిబిష్ణోయ్ 17 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. పేసర్లలో దీపక్ చాహర్ రెండు, అవేశ్ ఖాన్ చెరో వికెట్ తీశారు. అయితే, పేసర్లు పరుగులు ఎక్కువగా ఇచ్చేసినా అక్షర్, బిష్ణోయ్ కట్టడి చేశారు. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మాథ్యూ వేడ్ (36 నాటౌట్) చివర్లో పోరాడాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (31) మినహా ఇతర ఆసీస్ బ్యాటర్లు రాణించలేదు.  

అంతకు ముందు టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది భారత జట్టు. రింకూ సింగ్ (46), జితేశ్ శర్మ (35), యశస్వి జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32) రాణించడంతో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. రింకూ, జితేశ్ చివర్లో రాణించడంతో ఆ స్కోరును అందుకోగలిగింది. సూర్యకుమార్ యాదవ్‍కు కెప్టెన్‍గా ఇదే తొలి సిరీస్ కాగా.. భారత్ కైవసం అయింది.

తిప్పేసిన అక్షర్, బిష్ణోయ్

భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్‍లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. దూకుడుగా మొదలుపెట్టి మూడు ఓవర్లలోనే ఆసీస్ 40 పరుగులు చేసింది. అయితే, నాలుగో ఓవర్ తొలి బంతికే జోష్ ఫిలిప్ (8)ను బిష్ణోయ్ ఔట్ చేసి కళ్లెం వేశారు. జోరు మీద ఉన్న మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (31)ను ఔట్ చేశాడు భారత స్పిన్నర్ అక్షర్ పటేల్. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పేసర్లు ధారళంగా పరుగులు ఇచ్చినా వీరు కట్టడి చేశారు. మెక్‍డెర్మోట్ (19), అరోన్ హార్డీ (8)ని కూడా ఔట్ చేసి ఆసీస్‍ను దెబ్బ తీశాడు అక్షర్. ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యు వేడ్ (36 నాటౌట్) చివరి వరకు పోడాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో ఆసీస్‍కు ఓటమి తప్పలేదు. 

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ సిరీస్‍లో చివరిదైనా ఐదో టీ20 ఆదివారం (డిసెంబర్ 3) జరగనుంది. 

తదుపరి వ్యాసం