IND vs AUS: మళ్లీ అదరగొట్టిన రింకూ.. మోస్తరు స్కోరు చేసిన టీమిండియా
IND vs AUS 4th T20I Match: భారత యువ బ్యాటర్ రింకూ సింగ్ మరోసారి రాణించి.. భారత్‍ను ఆదుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో టీమిండియా మోస్తరు స్కోరు చేయగలిగింది. చివర్లో జితేశ్ శర్మ కాసేపు మెరిపించాడు.
IND vs AUS 4th T20I Match: ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో టీమిండియా మోస్తరు స్కోరు చేసింది. భారత యువ బ్యాటర్ రింకూ సింగ్ (29 బంతుల్లో 46 పరుగులు) మరోసారి కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. చివర్లో జితేశ్ శర్మ (19 బంతుల్లో 35 రన్స్) కాసేపు మెరిపించాడు.
రాయ్‍పూర్ వేదికగా నేడు (డిసెంబర్ 1) ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32) పర్వాలేదనిపించారు. చివర్లో రింకూ, జితేశ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్రార్షుస్ మూడు వికెట్లు, తన్వీర్ సంఘా, జెసన్ బెహరండాఫ్ చెరో రెండు, ఆరోన్ హార్డీ ఓ వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల టార్గెట్ ఉంది.
టాస్ ఓడిన టీమిండియా ముందుగా బ్యాటింగ్‍కు దిగింది. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (37) మరోసారి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే, ఆరో ఓవర్లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడినా.. శ్రేయస్ అయ్యర్ (8), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) వెనువెంటనే వెనుదిరిగాడు. దీంతో 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఆ తర్వాత కాసేపు దీటుగా ఆడిన రుతురాజ్ 14వ ఓవర్లో ఔటయ్యాడు.
రింకూ, జితేశ్ మెరుపులు
కష్టాల్లో పడిన జట్టు రింకూ సింగ్, జితేశ్ శర్మ ఆదుకున్నారు. ముఖ్యంగా జితేశ్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 19 బంతుల్లోనే 35 రన్స్ చేశాడు. మరోవైపు రింకూ మరోసారి కీలకమైన పరుగులు చేశాడు. ప్రశాంతంగా ఆడుతూనే బౌండరీలు బాదాడు. రింకూ, జితేశ్ కలిసి ఐదో వికెట్‍కు 56 రన్స్ జోడించారు. అయితే, అనంతరం ఇద్దరూ ఔటయ్యారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (0), దీపక్ చాహర్ (0), రవి బిష్ణోయ్ (4) రాణించలేకపోవటంతో భారత్‍కు భారీ స్కోరు దక్కలేదు. చివరి రెండు ఓవర్లలో ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు.