తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Women's T20 World Cup: న్యూజిలాండ్ చేతిలో భారత్ టీ20 వరల్డ్‌కప్ సెమీస్ ఆశలు.. ఆస్ట్రేలియా అడ్డు!

Women's T20 World Cup: న్యూజిలాండ్ చేతిలో భారత్ టీ20 వరల్డ్‌కప్ సెమీస్ ఆశలు.. ఆస్ట్రేలియా అడ్డు!

Galeti Rajendra HT Telugu

08 October 2024, 12:33 IST

google News
  • India T20 World Cup semis chances: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌ను ఓటమితో ప్రారంభించిన భారత్ జట్టు.. పాకిస్థాన్‌పై గెలిచినా సెమీస్ చేరడం కష్టంగా కనిపిస్తోంది. ఈరోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్ ఆశలపై క్లారిటీ రానుంది. 

ఇండియా ఉమెన్స్ టీమ్స్
ఇండియా ఉమెన్స్ టీమ్స్ (AFP)

ఇండియా ఉమెన్స్ టీమ్స్

యూఏఈ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు సెమీస్ ఆశలు ఇప్పుడు న్యూజిలాండ్ ఉమెన్స్ టీ20 చేతిలో ఉన్నాయి. గ్రూప్-ఎలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో మంగళవారం న్యూజిలాండ్ తలపడనుండగా.. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ జట్టు సెమీస్ అవకాశాలపై క్లారిటీరానుంది.

ఉమెన్స్ టీ20 వరల్డ్‌‌కప్‌లో గ్రూప్-ఎలో ఉన్న భారత్ జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లను ఆడింది. న్యూజిలాండ్‌తో ఫస్ట్ మ్యాచ్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో నెట్‌ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచినా.. వేగంగా ఛేజింగ్ చేయలేకపోవడతో నెట్‌ రన్‌రేట్ చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడలేదు.

కంగారుపెడుతున్న నెట్ రన్‌రేట్

ఐదు జట్లు ఉన్న గ్రూప్-ఎలో భారత్ జట్టు ప్రస్తుతం 2 పాయింట్లు, -1.217 నెట్ రన్‌రేట్‌తో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్,ఆస్ట్రేలియా చెరొక విజయంతో రెండేసి పాయింట్లతో టాప్-2లో ఉండగా.. వాటి నెట్ రన్‌రేట్ కూడా భారత్‌తో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది. టాప్‌లోని న్యూజిలాండ్‌కి +2.900, రెండో స్థానంలోని ఆస్ట్రేలియాకి +1.908 నెట్ రన్‌రేట్ ఉంది.

ఈరోజు షార్జా వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సాయంత్రం 6 గంటలకి తలపడనున్నాయి. భారత్ జట్టు సెమీస్ అవకాశాలు మెరుగవ్వాలంటే ఆస్ట్రేలియాని న్యూజిలాండ్ ఓడించాలి. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రం భారత్ సెమీస్ కష్టాలు రెట్టింపు అవుతాయి.

ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ ఓడిస్తే

మంగళవారం మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ ఓడిస్తే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కొద్ది తేడాతో భారత్ గెలిచినా సెమీస్ రేసులో ఉంటుంది. కానీ.. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రం.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో భారత్ జట్టు గెలవాల్సి ఉంటుంది. అయినప్పటికీ సెమీస్ చేరడం కష్టమే. దానికి కారణం ఇప్పటికే భారత్ కంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో ఉండటం

భారత్ జట్టు తర్వాత రెండు మ్యాచ్‌లను శ్రీలంక, ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. బుధవారం శ్రీలంకతో దుబాయ్ వేదికగా ఆడనున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఆదివారం ఆస్ట్రేలియాను ఢీకొననుంది. భారత్ జట్టు శ్రీలంకపై మెరుగైన రికార్డ్ ఉంది.. కానీ ఆస్ట్రేలియాపై లేదు.

తదుపరి వ్యాసం