Virat Kohli: విరాట్ కోహ్లీ ఫామ్‌పై కోచ్ గంభీర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్, అది నా పని కాదంటూ ఆఖర్లో చురకలు
15 October 2024, 7:00 IST
Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య దాదాపు ఏడాది పాటు కోల్డ్ వార్ నడిచింది. దాంతో గంభీర్ కోచ్‌గా వస్తే కోహ్లీపై ఆ ప్రభావం పడుతుందని కోహ్లీ అభిమానులు ఆందోళన చెందారు. అయితే గంభీర్ మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.
విరాట్ కోహ్లీతో గౌతమ్ గంభీర్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మళ్లీ చర్చ మొదలైంది. గత ఏడాది కాలంగా టెస్టుల్లో ఆశించిన మేర విరాట్ కోహ్లీ రాణించలేకపోతున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లోనూ కోహ్లీ విఫలమయ్యాడు.
బుధవారం (అక్టోబరు 16) నుంచి న్యూజిలాండ్‌తో భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడనుండటంతో మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్..కోహ్లీ ఫామ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అరంగేట్రం మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీలో కనిపించిన పరుగుల దాహం ఇప్పటికీ ఉందని, ప్రతి ఇన్నింగ్స్ తర్వాత అతడి ఫామ్‌ను అంచనా వేయడం సరికాదని గౌతమ్ గంభీర్ హితవు పలికాడు.
కోహ్లీ లాస్ట్ 8 ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్
సెంచూరియన్ వేదికగా 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చివరిగా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత వరుసగా 8 ఇన్నింగ్స్‌ల్లో అతను ఫెయిలయ్యాడు. అయితే నవంబరు నుంచి ఆస్ట్రేలియాతో కీలకమైన బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ (ఐదు టెస్టుల సిరీస్)ను భారత్ జట్టు ఆడనుండటంతో విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడం టీమిండియా చాలా కీలకం.
‘‘విరాట్ గురించి నా ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. అతను ప్రపంచ స్థాయి క్రికెటర్. ఇన్నేళ్లుగా బాగా రాణిస్తున్నాడు. అరంగేట్రం సమయంలో విరాట్ కోహ్లీలో ఉన్న పరుగుల దాహం ఇప్పటికీ అలానే ఉంది. ఆ ఆకలే ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా కోహ్లీని దిద్దింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాపై కూడా కోహ్లీ పరుగులు సాధిస్తాడనే నమ్మకం నాకుంది. ఏ ఆటగాడినీ ఒక మ్యాచ్ లేదా సిరీస్ ఆధారంగా అంచనా వేయకూడదు’’ అని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్.. ఫామ్ కోల్పోయిన బాబర్ అజామ్ లాంటి స్టార్ ప్లేయర్‌పై సోమవారం వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించరా? అనే ప్రశ్నకి గంభీర్ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు.
వేటు వేయడం నా పని కాదు
‘‘ప్రతిరోజూ ఏ ప్లేయర్ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేడు. ఆటగాళ్లకు అండగా నిలవడమే మా పని. అత్యుత్తమమైన 11 మందితో తుది జట్టుని ఎంపిక చేయడమే నా పని, ప్లేయర్లని జట్టు నుంచి తప్పించడం కాదు. అయినా ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా లెక్కలు తీయడం సరికాదు. జట్టు వరుసగా విజయాలు సాధిస్తుంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది?’’ అంటూ గంభీర్ చురకలు వేశారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 16 నుంచి బెంగళూరు వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత పుణె వేదికగా అక్టోబరు 24 నుంచి రెండో టెస్టు, ఆఖరి మ్యాచ్ నవంబరు 1 నుంచి ముంబయిలో జరగనుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.