SRH vs GT IPL 2024: టాస్ హైదరాబాద్‍దే.. మార్పుల్లేకుండా ఎస్ఆర్‌హెచ్.. గుజరాత్‍లో రెండు ఛేంజెస్.. తుది జట్లు ఇవే
31 March 2024, 15:40 IST
- GT vs SRH IPL 2024: ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో పోరుకు సన్‍రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగింది. గత మ్యాచ్‍లో రికార్డుల మోత మోగించిన హైదరాబాద్ జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‍లో ఎస్ఆర్‌హెచ్ టాస్ గెలిచింది.
SRH vs GT IPL 2024: టాస్ హైదరాబాద్‍దే.. మార్పుల్లేకుండా ఎస్ఆర్‌హెచ్.. గుజరాత్‍లో రెండు ఛేంజెస్.. తుది జట్లు ఇవే
IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 సీజన్‍లో తన రెండో మ్యాచ్‍లో రికార్డుల మోత మోగించి ఘనంగా బోణీ కొట్టింది సన్‍రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సహా అనేక రికార్డులను బద్దలుకొట్టి హోం గ్రౌండ్‍లో ముంబైపై విజయం సాధించింది. ఇప్పుడు హైదరాబాద్ మరో పోరుకు బరిలోకి దిగింది. అహ్మదాబాద్ వేదికగా నేటి (మార్చి 31, ఆదివారం) మధ్యాహ్నం మ్యాచ్‍లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో ఎస్ఆర్‌హెచ్ తలపడుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన సన్‍రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు.
మార్పుల్లేకుండా ఎస్ఆర్‌హెచ్
ముంబై జట్టుతో గత మ్యాచ్‍తో ఆడిన జట్టునే సన్‍రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్‍తో మ్యాచ్‍కు కొనసాగించింది. తుది జట్టులో మార్పులు చేయలేదు. ముంబై జట్టుపై 277 పరుగులు చేసి ఐపీఎల్‍లోనే అత్యధిక స్కోరు రికార్డును హైదరాబాద్ దక్కించుకుంది. మరిన్ని రికార్డులు బద్దలయ్యాయి. ఆ మ్యాచ్‍లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెస్ వీరబాదుడు బాదారు. పరుగుల సునామీ సృష్టించారు. హైదరాబాద్ భారీ విజయం సాధించింది. దీంతో గుజరాత్‍తో నేటి మ్యాచ్‍కు విన్నింగ్ కాంబినేషన్‍ను అలాగే కంటిన్యూ చేసింది ఎస్‍ఆర్‌హెచ్.
గత మ్యాచ్‍తో పోలిస్తే గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. స్పెన్సర్ జాన్సన్ స్థానంలో తుది జట్టులో స్పిన్నర్ నూర్ అహ్మద్‍ను తీసుకుంది. సాయి కిశోర్ ప్లేస్‍లో దర్శన్ నల్కండేను ఎంపిక చేసుకుంది.
అహ్మదాబాద్ స్టేడియం సాధారణంగా లక్ష్యఛేదనకే అనుకూలంగా ఉంటుంది. అయితే, గత మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసి సత్తాచాటడంతో ఈ మ్యాచ్‍లోనూ అలాగే చేయాలని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ నిర్ణయించుకున్నాడు. దీంతో టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకున్నాడు.
సన్‍రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్ రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమాద్, షహబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కత్
హైదరాబాద్ సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, నితీశ్ రెడ్డి, ఉపేంద్ర యాదవ్
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు: వృద్ది మాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‍మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే
గుజరాత్ సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: సాయి సుదర్శన్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, శరత్ బీఆర్, మానవ్ సూతర్, అభినవ్ మనోహర్
ఐపీఎల్ 2024 సీజన్‍లో తన తొలి మ్యాచ్‍లో కోల్‍కతా చేతిలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. అయితే, ఆ తర్వాత మార్చి 27న ముంబై ఇండియన్స్ టీమ్‍తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ గర్జించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సహా అనే రికార్డులను సృష్టించింది. అలాగే, ఈ మ్యాచ్‍లో 31 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. నేడు గుజరాత్‍తో మ్యాచ్‍లోనూ సత్తాచాటాలని ఎస్‍ఆర్‌హెచ్ కసిగా ఉంది.
టాపిక్