Google Doodle: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ను సెలబ్రేట్ చేస్తున్న గూగుల్ డూడుల్
19 November 2023, 11:04 IST
- Google Doodle: క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ సందర్భంగా గూగుల్ ఓ ప్రత్యేక డూడుల్ క్రియేట్ చేసింది. ఆదివారం (నవంబర్ 19) ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఈ డూడుల్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.
వరల్డ్ కప్ 2023 ఫైనల్ ను సెలబ్రేట్ చేస్తూ గూగుల్ రూపొందించిన డూడుల్
Google Doodle: ప్రపంచంలో ఏ మూలకు ఎలాంటి ప్రత్యేక సందర్భం ఉన్నా దానిని సెలబ్రేట్ చేసే గూగుల్ డూడుల్.. తాజాగా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఓ స్పెషల్ డూడుల్ క్రియేట్ చేసింది. క్రికెట్ థీమ్ తో ప్రత్యేకంగా ఈ డూడుల్ రూపొందించడం విశేషం. క్రికెట్ లో ఉపయోగించే 22 గజాలు పిచ్ పై గూగుల్ అనే అక్షరాల్లోనే ట్రోఫీ, క్రికెట్ బ్యాట్ ఉంచింది.
ఈ గూగుల్ డూడుల్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ డూడుల్ పై క్లిక్ చేస్తే అది వరల్డ్ కప్ కు సంబంధించిన వెబ్ సైట్ల వివరాల పేజ్ లోకి తీసుకెళ్తోంది. వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ అందరూ ఈ స్పెషల్ డూడుల్ తో ఫైనల్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో 1.32 లక్షల మంది అభిమానుల మధ్య ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ట్రోఫీ కోసం తలపడబోతున్నాయి. టీమిండియా మూడో వరల్డ్ కప్ కోసం చూస్తుండగా.. ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ స్టేడియంలో అత్యధిక మంది చూసిన క్రికెట్ మ్యాచ్ గా రికార్డు క్రియేట్ చేయబోతోంది.
ఇక మరికొన్ని కోట్ల మంది టీవీ సెట్లకు అతుక్కుపోనున్నారు. 2011 తర్వాత ఇండియా తొలిసారి ఫైనల్ చేరడంతో ఈ మ్యాచ్ పై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. 12 ఏళ్ల తర్వాత మరోసారి ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందన్న ఆశతో అభిమానులు ఉన్నారు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన ఇండియన్ టీమ్ కు 20 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కింది.
టాపిక్