Gavaskar on South Africa: కవర్లు కొనడానికీ డబ్బుల్లేవా?: సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై గవాస్కర్ ఆగ్రహం
11 December 2023, 7:37 IST
- Gavaskar on South Africa: ఇండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన తర్వాత సౌతాఫ్రికా బోర్డుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కవర్లు కొనడానికీ డబ్బుల్లేవా అని ప్రశ్నించాడు.
ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20 రద్దవడంపై గవాస్కర్ ఆగ్రహం
Gavaskar on South Africa: ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలుసు కదా. అయితే ఇందులో వర్షంతోపాటు క్రికెట్ సౌతాఫ్రికా పాత్ర కూడా అంతే ఉందంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ కాలంలో ప్రతి క్రికెట్ బోర్డు దగ్గర భారీగా డబ్బు ఉందని, మొత్తం ఫీల్డ్ ను కవర్ చేయడానికి కవర్లు కొంటే ఏమయ్యేదని అతడు ప్రశ్నించాడు.
డర్బన్ లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20 జరగాల్సింది. అయితే అక్కడ వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దయిన తర్వాత గవాస్కర్ లైవ్ టీవీలోనే క్రికెట్ సౌతాఫ్రికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా పర్యటనతో సౌతాఫ్రికా బోర్డుకు టీవీ హక్కుల ద్వారానే ఏకంగా 5.3 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చింది.
ఇంత డబ్బుతో కనీసం కవర్లు కూడా కొనలేరా అంటూ గవాస్కర్ సీరియస్ అయ్యాడు. మొత్తం ఫీల్డ్ ను కవర్లతో కప్పి ఉంటే మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి వచ్చేది కాదన్నది సన్నీ అభిప్రాయంగా కనిపిస్తోంది. "మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోతే వర్షం ఆగినప్పుడు మ్యాచ్ ప్రారంభానికి కనీసం గంట పడుతుంది. ఒకవేళ మళ్లీ వర్షం పడితే ఇక ఆట సాధ్యం కాదు.
ప్రతి బోర్డు చాలా డబ్బు సంపాదిస్తోంది. ఎలాంటి పొరపాట్లూ చేయకూడదు. అన్ని క్రికెట్ బోర్డుల దగ్గర భారీగా డబ్బు ఉంది. మా దగ్గర లేవు అంటే అబద్ధం చెబుతున్నట్లే. బీసీసీఐ దగ్గర ఉన్నంత డబ్బు లేకపోవచ్చు. అది నిజమే. కానీ గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేసేలా కవర్లు కొనడానికైతే డబ్బులు ఉన్నాయి" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.
ఈ సందర్భంగా 2019 వరల్డ్ కప్ గురించి సన్నీ గుర్తు చేశాడు. ఆ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో ఇండియా కీలకమైన మ్యాచ్ కూడా రద్దయిన విషయం తెలిసిందే. తర్వాత ఈ రెండు జట్ల సెమీస్ మ్యాచ్ కూడా వర్షం బారిన పడింది. "ఇంగ్లండ్ లో చాలా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగలేదు.
ఎందుకంటే గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేయలేదు. వర్షం ఆగినా.. మిగతా మైదానమంతా తడిగా ఉంటుంది. చాలా టీమ్స్ పాయింట్లు కోల్పోయాయి. సౌతాఫ్రికాకూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటం వల్ల ఆ టీమ్ మ్యాచ్ ఆడలేకపోయింది" అని గవాస్కర్ అన్నాడు.
ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలో తీసుకున్న చర్యలను గవాస్కర్ కొనియాడాడు. "అన్ని బోర్డులూ మొత్తం గ్రౌండ్ ను కవర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో సాకులు వెతకొద్దు. ఈడెన్ గార్డెన్స్ లో ఓ టెస్ట్ మ్యాచ్ ఇలాగే జరగలేదు. తర్వాతి మ్యాచ్ కు గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేశారు. అలాంటి చర్యలు అవసరం. సౌరవ్ గంగూలీకి ఈ ఘనత దక్కుతుంది. ఈడెన్ గార్డెన్స్ వైపు ఎవరూ వేలెత్తి చూపకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు" అని గవాస్కర్ గుర్తు చేశాడు.