IND vs SA 1st T20 abandoned: టీమిండియా, సౌతాఫ్రికా మొదటి టీ20 వర్షార్పణం- టాస్ పడకుండానే రద్దు- రెండో మ్యాచ్ ఎప్పుడంటే..
IND vs SA 1st T20 abandoned: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 రద్దయింది. కనీసం టాస్ పడకుండానే వాన కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయింది.
IND vs SA 1st T20 abandoned: ఫుల్ జోష్‍తో దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఆతిథ్య సౌతాఫ్రికాతో నేడు జరగాల్సిన తొలి టీ20 వాన కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‍తోనే దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటన మొదలవ్వాల్సింది. కానీ ఈ ఫస్ట్ ఫైట్ రద్దయింది. మూడు టీ20ల సిరీస్‍లో భాగంగా దర్బన్ వేదికగా నేడు (డిసెంబర్ 10) భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయింది. కనీసం టాస్ కూడా పడకుండానే క్యాన్సిల్ అయింది. వివరాలివే..
దర్బన్‍లో నేటి (డిసెంబర్ 10) ఉదయం నుంచే వాన పడింది. అయితే, మ్యాచ్ సమయానికి వర్షం ఉందని వాతావరణ రిపోర్టులు చెప్పాయి. అయితే, అలా జరగలేదు. మ్యాచ్ జరగాల్సిన టైమ్‍కు కూడా వర్షం కొనసాగింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దీంతో పిచ్‍పై కవర్లు అలాగే కొనసాగాయి. కాసేపు వాన ఆగినా మళ్లీ జోరుగా పడింది.
వాన అలాగే కొనసాగడంతో మైదానాన్ని అంపైర్లు పరిశీలించేందుకు కూడా మధ్యలో కుదరలేదు. ఇక ఆట సాధ్యం కాదనుకొని అంపైర్లు నిర్ణయించారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ తొలి టీ20 మ్యాచ్‍ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఈ ఫస్ట్ ఫైట్ క్యాన్సిల్ అయింది.
రెండో టీ20 వివరాలివే..
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం (డిసెంబర్ 12) రెండో టీ20 జరగనుంది. క్యూహెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 12న రాత్రి 8.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ రెండో టీ20 మ్యాచ్ మొదలుకానుంది.
ఈ టీ20 సిరీస్‍లో చివరిదైన మూడో టీ20 డిసెంబర్ 14 జరగనుంది. ఈ సిరీస్ గెలవాలంటే భారత్, దక్షిణాఫ్రికా మిలిగిన రెండు మ్యాచ్‍ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో టీమిండియాకు టీ20 సిరీస్‍లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు.
దక్షిణాఫ్రికా టూర్‌లో మూడు వన్డేల సిరీస్(డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 21 మధ్య)లో భారత్ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించనున్నాడు. టెస్టు సిరీస్‍కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి టీమిండియాలోకి వస్తారు. రోహిత్ సారథిగా ఉంటాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టులు (డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 7 మధ్య) జరగనున్నాయి.