Gambhir on Babar Azam: బాబర్ ఆజంది చెత్త కెప్టెన్సీ.. ఆ సింపుల్ విషయం మరచిపోయి ఓడిపోయారు: గంభీర్
15 September 2023, 16:56 IST
- Gambhir on Babar Azam: బాబర్ ఆజంది చెత్త కెప్టెన్సీ.. ఆ సింపుల్ విషయం మరచిపోవడంతో పాకిస్థాన్ ఓడిపోయింది అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.
బాబర్ ఆజం
Gambhir on Babar Azam: ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో ఓటమితో పాకిస్థాన్ ఇంటిదారి పట్టక తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ లో బాబర్ ఆజం కెప్టెన్సీ చెత్తగా ఉందని అన్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. చివరి ఓవర్లలో ఫీల్డింగ్ సెట్ చేసిన విధానాన్ని అతడు తప్పుబట్టాడు.
"నా వరకూ బాబర్ ఆజంది మరీ దారుణమైన కెప్టెన్సీ. జమాన్ ఖాన్ బౌలింగ్ లో మిడాఫ్ మీదుగా ఓ ఫోర్ కొట్టారు. మళ్లీ షహీన్ షా అఫ్రిది బౌలింగ్ లోనూ మిడాఫ్ మీదుగానే మరో ఫోర్ వచ్చింది. ఆ రెండు బాల్స్ స్లో బాల్సే. స్లోబాల్స్ వేయాలని అనుకున్నప్పుడు మిడాఫ్ ఫీల్డర్ లాంగాఫ్ ఉండాలి.
థర్డ్ మ్యాన్ ను సర్కిల్ లోకి తీసుకురావాలి. ఇది చాలా సింపుల్ కెప్టెన్సీ. ఒకవేళ చివరి ఓవర్లో శ్రీలంక 13 పరుగులు చేజ్ చేయాల్సి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. శ్రీలంకకు చాలా కష్టమయ్యేది" అని గంభీర్ అన్నాడు.
వికెట్ల కోసం చూస్తూ.. శ్రీలంక బ్యాటర్లపై బాబర్ ఒత్తిడి కొనసాగించేలా చూడాల్సిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. "ఒక దశలో మ్యాచ్ త్వరగా ముగిసిపోవాలన్నట్లుగా చూశారు. ఆరో బౌలర్ కోటాను పూర్తి చేయాలని చూశారు. అది అలా కుదరదు.
కుశల్ మెండిస్, సదీర సమరవిక్రమ భాగస్వామ్యాన్ని విడదీయడానికి ప్రధాన బౌలర్ ను తీసుకురావాల్సింది. వికెట్లు తీయడం ద్వారానే పాకిస్థాన్ ఈ మ్యాచ్ గెలిచేది. టీ20 క్రికెట్ కంటే వన్డే క్రికెట్ భిన్నమైనది. అందుకే ఇందులో బాబర్ ఆజం కెప్టెన్సీ మరింత మెరుగ్గా ఉండాలి" అని గంభీర్ అన్నాడు.