Gambhir on Shreyas: అసలు హీరో కోహ్లి కాదు శ్రేయస్.. అతనికి ఎక్కువ ఫాలోవర్లు లేకే ఇలా..: గంభీర్
17 November 2023, 14:40 IST
- Gambhir on Shreyas: అసలు హీరో కోహ్లి కాదు శ్రేయస్ అయ్యర్ అని అన్నాడు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్. బహుశా శ్రేయస్ కు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు లేకపోవడంతో అతనికి తగినంత పేరు రావడం లేదని గంభీర్ అనడం గమనార్హం.
గౌతమ్ గంభీర్
Gambhir on Shreyas: వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై ఇండియా విజయం సాధించడంలో తన వరకూ అసలు హీరో శ్రేయస్ అయ్యర్ అని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ మ్యాచ్ లో వన్డేల్లో 50వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లికే ఎక్కువ క్రెడిట్ ఇస్తుండటంపై గౌతీ మండిపడ్డాడు. శ్రేయస్ కు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు లేకపోవడం ఇలా జరిగి ఉండొచ్చని గంభీర్ అన్నాడు.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి (117)తోపాటు శ్రేయస్ అయ్యర్ (105) కూడా సెంచరీ చేశాడు. అయితే శ్రేయస్ మాత్రం కేవలం 67 బంతుల్లోనే మెరుపు సెంచరీ చేయడంతో పాటు చివర్లో కేఎల్ రాహుల్ చెలరేగడంతో ఇండియా 397 పరుగుల భారీ స్కోరు చేసింది. గంభీర్ ఇదే విషయాన్ని చెబుతూ.. టీమ్ అంత భారీ స్కోరు చేయడంలో శ్రేయస్ దే కీలకపాత్ర అని, ఒకవేళ 350 చేసి ఉంటే తీవ్ర ఒత్తిడి ఉండేదని అన్నాడు.
"నేను కామెంటరీ కూడా చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. న్యూజిలాండ్ పై గేమ్ ఛేంజర్ శ్రేయస్ అయ్యరే. సోషల్ మీడియాలో అతనికి ఎక్కువగా ఫాలోవర్లు లేనట్లున్నారు. అందుకే అతనికి అంతగా ప్రశంసలు దక్కలేదు. అతడు తన తొలి వరల్డ్ కప్ ఆడుతున్నాడు. అనుభవం ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇలాంటి పెద్ద మ్యాచ్ లలో రాణించాలని అందరూ అనుకుంటారు. కోహ్లి తన నాలుగో వరల్డ్ కప్, రోహిత్ మూడో వరల్డ్ కప్ ఆడుతున్నారు. శ్రేయస్ మాత్రం తొలి వరల్డ్ కప్ లో ఆడుతున్నాడు" అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ తో అన్నాడు.
"కానీ దురదృష్టవశాత్తూ ఇతరులకు వచ్చినన్ని ప్రశంసలు అతనికి దక్కడం లేదు. నా వరకూ శ్రేయస్ అయ్యర్ నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లిపై ఒత్తిడి పెరగకుండా చూశాడు. 350, 390 మధ్య తేడా శ్రేయస్ అయ్యరే. ఒకవేళ ఇండియా 350 టార్గెట్ సెట్ చేసి ఉంటే ఎంత ఒత్తిడిలో ఉండేదో ఊహించండి" అని గంభీర్ అన్నాడు.
ఈ మ్యాచ్ లో ఇండియా 398 పరుగుల లక్ష్యం విధించినా.. న్యూజిలాండ్ చివరి వరకూ పోరాడింది. డారిల్ మిచెల్ సెంచరీ, విలియమ్సన్ హాఫ్ సెంచరీ చేయడంతో ఒక దశలో అంత భారీ టార్గెట్ చేజ్ చేసేలానే కనిపించింది. కానీ విలియమ్సన్ ను షమి ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.