Ravi Shastri on Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డును కూడా కోహ్లి బ్రేక్ చేస్తాడు: రవిశాస్త్రి
Ravi Shastri on Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డును కూడా కోహ్లి బ్రేక్ చేస్తాడని మాజీ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. వన్డేల్లో 50వ సెంచరీతో కోహ్లి మొత్తం అంతర్జాతీయ సెంచరీల సంఖ్య 80కి చేరిన విషయం తెలిసిందే.
Ravi Shastri on Virat Kohli: సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన 49 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లి బ్రేక్ చేయడమే ఓ సంచలనం అయితే.. ఇప్పుడు ఓవరాల్ గా మాస్టర్ 100 సెంచరీల రికార్డును కూడా అతడు బ్రేక్ చేయగలడని మాజీ కోచ్ రవిశాస్త్రి అనడం విశేషం. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో కోహ్లి 50వ సెంచరీతో 25 ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
విరాట్ కోహ్లి 291 వన్డేల్లోనే 50 సెంచరీల మార్క్ అందుకోవడం మరో విశేషం. కోహ్లి ఇప్పటికీ మూడు ఫార్మాట్లలోనూ ఆడుతుండటం, మరో మూడు, నాలుగేళ్లు కొనసాగే సత్తా అతనిలో ఉండటంతో 100 సెంచరీ మార్క్ పెద్ద కష్టం కాదని మాజీ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. సెమీస్ తర్వాత ఐసీసీతో అతడు మాట్లాడాడు.
"సచిన్ 100 సెంచరీలు చేసినప్పుడు దానికి దరిదాపుల్లోకి కూడా ఎవరైనా వస్తారని ఎవరనుకున్నారు. కానీ కోహ్లి ఇప్పటికే 80 సెంచరీలు చేశాడు. 80 అంతర్జాతీయ సెంచరీలు. అందులో 50 కేవలం వన్డేల్లోనే వచ్చాయి. ఇది అత్యద్భుతం. ఏదీ అసాధ్యం కాదు. ఎందుకంటే ఇలాంటి ప్లేయర్స్ సెంచరీలు కొట్టడం మొదలు పెట్టారంటే చాలా వేగంగా చేసేస్తుంటారు. అతని తర్వాతి 10 ఇన్నింగ్స్ లో మరో ఐదు చేయొచ్చు. అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉన్నాడు. ఇంకా అతడు మూడు, నాలుగేళ్లు ఆడే అవకాశం కూడా ఉంది" అని రవిశాస్త్రి అన్నాడు.
కోహ్లి పెద్ద మ్యాచ్ లలో మొదట్లో క్రీజులో నిలదొక్కుకుంటూ ఒత్తిడిని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని శాస్త్రి చెప్పాడు. "గత వరల్డ్ కప్ లలో కోహ్లి ఆట పూర్తి భిన్నంగా ఉంది. క్రీజులోకి వచ్చీ రాగానే బాదడానికి ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు అలా ఆడటం లేదు. టైమ్ తీసుకుంటున్నాడు. ఒత్తిడిని తట్టుకుంటున్నాడు. ఇన్నింగ్స్ లో చివరి వరకూ ఆడాలన్న తన పాత్రను అర్థం చేసుకుంటున్నాడు. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు" అని రవిశాస్త్రి చెప్పాడు.
విరాట్ కోహ్లి ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. 10 మ్యాచ్ లలో 711 రన్స్ తో ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ (673) రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఫైనల్లోనూ ఆడబోతున్నాడు.