Ravi Shastri on Team India: 50 ఏళ్లలో నేను చూసిన బెస్ట్ టీమిండియా బౌలింగ్ అటాక్ ఇదే..: రవిశాస్త్రి
Ravi Shastri on Team India: 50 ఏళ్లలో నేను చూసిన బెస్ట్ టీమిండియా బౌలింగ్ అటాక్ ఇదే అని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నాడు. నెదర్లాండ్స్ తో వరల్డ్ కప్ 2023 చివరి లీగ్ మ్యాచ్ కు ముందు శాస్త్రి ఈ కామెంట్స్ చేశాడు.
Ravi Shastri on Team India: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టీమ్ ప్రస్తుత బౌలింగ్ అటాక్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. గత 50 ఏళ్లలో తాను చూసిన అత్యుత్తమ బౌలింగ్ అటాక్ ఇదే అని అతడు అనడం విశేషం. ప్రస్తుతం వరల్డ్ కప్ లో 8 లీగ్ మ్యాచ్ లలోనూ గెలిచి 9వ విజయంపై కన్నేసిన ఇండియా.. నెదర్లాండ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది.
ఈ మ్యాచ్ కు ముందు రవిశాస్త్రి క్లబ్ ప్రాయిరీ ఫైర్ పాడ్‌కాస్ట్ తో మాట్లాడాడు. ఈసారి ఇండియా ట్రోఫీ మిస్ అయితే మరో మూడు వరల్డ్ కప్‌లపాటు వేచి చూడాల్సిందే అని అతడు అనడం విశేషం. తొలి మ్యాచ్ నుంచీ ఈ టోర్నీలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండియన్ టీమ్.. టాప్ ప్లేస్ లో సెమీస్ కు అర్హత సాధించింది.
"ఒకవేళ ఈసారి వరల్డ్ కప్ గెలవకపోతే మరో మూడు వరల్డ్ కప్ ల వరకూ దాని గురించి కనీసం ఆలోచన కూడా చేయలేరు. ప్రస్తుతం టీమ్ లో 7, 8 మంది తమ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నారు. వాళ్లకు ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు. వాళ్లు ఆడుతున్న తీరు, కండిషన్స్ బట్టి చూస్తే ఇది గెలిచే టీమే" అని శాస్త్రి అన్నాడు.
బౌలింగ్ అటాక్ పై అతడు ప్రశంసలు కురిపించాడు. "వైట్ బాల్ క్రికెట్ ప్రారంభమైన తర్వాత గత 50 ఏళ్లలో నేను చూసి బెస్ట్ బౌలింగ్ అటాక్ ఇది. బౌలింగ్ లో ఉన్న వెరైటీయే దీనికి కారణం. బుమ్రా ఉన్నాడు. అతడు విచిత్రమైన బౌలర్. షమి సీమ్ పొజిషన్ లో ఓ మాస్టర్. సిరాజ్ భయపెడతాడు. జడేజా తన టాప్ ఫామ్ లో ఉన్నాడు. కుల్దీప్ చాలా మెరుగయ్యాడు" అని రవిశాస్త్రి చెప్పాడు.
ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీపైనా శాస్త్రి ప్రశంసలు కురిపించాడు. రోహిత్ తన వనరులను బాగా ఉపయోగించుకున్నాడని అన్నాడు. "వీళ్లందరికీ అనుభవం ఉంది. కానీ రోహిత్ ఏమాత్రం అలసత్వాన్ని సహించడు. వాళ్లు ఏమైనా తప్పు చేశారంటే అతడు వెంటనే హెచ్చరిస్తాడు. క్రమశిక్షణ అక్కడి నుంచే వస్తోంది. అతడు తన వనరులను బాగా ఉపయోగించుకున్నాడు. వరల్డ్ కప్ లో అతడు అద్భుతమైన కెప్టెన్ గా ఉన్నాడు. చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు" అని శాస్త్రి అన్నాడు.