తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Eng Vs Ned World Cup 2023: నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్.. ఏడో స్థానానికి డిఫెండింగ్ ఛాంపియన్

Eng vs Ned World Cup 2023: నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్.. ఏడో స్థానానికి డిఫెండింగ్ ఛాంపియన్

Hari Prasad S HT Telugu

08 November 2023, 21:25 IST

google News
    • Eng vs Ned World Cup 2023: నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించింది డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్. ఏకంగా 160 పరుగులతో గెలిచి పాయింట్ల టేబుల్లో ఏడో స్థానానికి చేరింది.
వరల్డ్ కప్ 2023లో వరుసగా ఐదు ఓటముల తర్వాత గెలిచిన ఇంగ్లండ్
వరల్డ్ కప్ 2023లో వరుసగా ఐదు ఓటముల తర్వాత గెలిచిన ఇంగ్లండ్ (AP)

వరల్డ్ కప్ 2023లో వరుసగా ఐదు ఓటముల తర్వాత గెలిచిన ఇంగ్లండ్

Eng vs Ned World Cup 2023: వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ చేరకపోయినా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చివర్లో కాస్త పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. నెదర్లాండ్స్ తో బుధవారం (నవంబర్ 8) జరిగిన మ్యాచ్ లో 160 పరుగులతో గెలిచి.. పాయింట్ల టేబుల్లో ఏడో స్థానానికి చేరిన ఆ టీమ్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించే అవకాశాలను మెరుగుపరచుకుంది. వరల్డ్ కప్ లో వరుసగా ఐదు ఓటముల తర్వాత ఇంగ్లండ్ తొలి విజయం సాధించింది.

340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. 37.2 ఓవర్లలో కేవలం 179 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు ఆదిల్ రషీద్, మొయిన్ అలీ మూడేసి వికెట్లతో నెదర్లాండ్స్ ను కట్టడి చేశారు. ఆ టీమ్ లో తేజ నిడమనూరు మాత్రమే 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 38 రన్స్ చేశాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ 8 మ్యాచ్ లలో 2 విజయాలు, 4 పాయింట్లు, -0.885 నెట్ రన్‌రేట్ తో పాయింట్ల టేబుల్లో 7వ స్థానానికి వచ్చింది.

2025లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి టాప్ 8 టీమ్స్ నేరుగా క్వాలిఫై కానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ కు ఈ విజయం ఎంతో కీలకమైనదనే చెప్పాలి. ఆ టీమ్ మరో మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడాల్సి ఉంది. అందులోనూ గెలిస్తే ఇంగ్లిష్ టీమ్ కనీసం ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించి పరువు నిలబెట్టుకుంటుంది.

స్టోక్స్, మలన్ మెరుపులు

అంతకుముందు ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. స్టోక్స్ సెంచరీ, డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 రన్స్ చేసింది. ఈ మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ లోనూ తడబడుతున్న ఇంగ్లిష్ టీమ్.. ఈ మ్యాచ్ లోనూ అలాగే వరుసగా వికెట్లు కోల్పోయినా తర్వాత కోలుకొని భారీ స్కోరు చేయగలిగింది.

ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్ 84 బంతుల్లోనే 108 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్స్ లు, 6 ఫోర్లు ఉన్నాయి. స్టోక్స్ కేవలం 78 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. వరల్డ్ కప్ లలో ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన సెంచరీ. గతంలో మోర్గాన్ 57 బంతుల్లో, బట్లర్ 75 బంతుల్లో సెంచరీలు చేశారు. ఈ రెండు సెంచరీలు 2019 వరల్డ్ కప్ లోనే వచ్చాయి.

నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ కు మంచి స్టార్ట్ లభించినా.. మరోసారి మిడిలార్డర్ లో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే మలన్, స్టోక్స్ ఆ టీమ్ ను ఆదుకున్నారు. ఈ టోర్నీలో మంచి ఫామ్ లో ఉన్న మలన్ 74 బంతుల్లో 87 రన్స్ చేసి రనౌటయ్యాడు. అయితే బెయిర్‌స్టో (15), రూట్ (28), బ్రూక్ (11), బట్లర్ (5), మొయిన్ అలీ (4) ఫెయిలవడంతో ఒక దశలో ఇంగ్లండ్ 192 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

ఓవైపు సహచరులంతా వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. స్టోక్స్ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి క్రిస్ వోక్స్ (45 బంతుల్లో 51) మంచి సహకారం అందించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. ఈ ఇద్దరూ ఏడో వికెట్ కు 80 బంతుల్లోనే 129 రన్స్ జోడించడం విశేషం.

స్టోక్స్ కేవలం 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరికి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతడు ఔటయ్యాడు. మిడిల్ ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటర్లను బాగానే కట్టడి చేసిన నెదర్లాండ్స్ బౌలర్లు.. చివర్లో చేతులెత్తేశారు. చివరి 10 ఓవర్లలోనే ఇంగ్లండ్ 124 రన్స్ జోడించడం విశేషం.

తదుపరి వ్యాసం