Afg vs Ned Scorecard: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్థాన్.. సెమీస్ వైపు మరో అడుగు.. పాకిస్థాన్ కంటే పైకి..-afg vs ned scorecard afghanistan beat netherlands move closer to semifinal berth ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Afg Vs Ned Scorecard: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్థాన్.. సెమీస్ వైపు మరో అడుగు.. పాకిస్థాన్ కంటే పైకి..

Afg vs Ned Scorecard: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్థాన్.. సెమీస్ వైపు మరో అడుగు.. పాకిస్థాన్ కంటే పైకి..

Hari Prasad S HT Telugu
Nov 03, 2023 08:11 PM IST

Afg vs Ned Scorecard: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది ఆఫ్ఘనిస్థాన్. వరల్డ్ కప్ సెమీస్ వైపు మరో అడుగు వేసింది. పాయింట్ల టేబుల్లో పాకిస్థాన్ కంటే పైకి దూసుకెళ్లింది. ఈ మెగా టోర్నీలో స్ఫూర్తిదాయక ఆటతీరు ప్రదర్శిస్తున్న ఆఫ్ఘన్ టీమ్.. తన నాలుగో విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది
ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది (AP)

Afg vs Ned Scorecard: వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్ వైపు మరో అడుగు వేసింది ఆప్ఘనిస్థాన్ టీమ్. శుక్రవారం (నవంబర్ 3) నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఏడు మ్యాచ్ లలో నాలుగో విజయంతో సెమీస్ బెర్త్ పై ఆశలు రేపుతోంది. మరోవైపు ఈ ఓటమితో నెదర్లాండ్స్ టీమ్ వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి వెళ్లిపోయింది.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ టీమ్.. కేవలం 31.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. ఈ విజయంతో ఆఫ్ఘన్ టీమ్ పాయింట్ల టేబుల్లో పాకిస్థాన్ ను వెనక్కి నెట్టి ఐదోస్థానానికి దూసుకెళ్లడం విశేషం. ప్రస్తుతం ఆ టీమ్ 7 మ్యాచ్ లలో 4 విజయాలు, మూడు ఓటములతో 8 పాయింట్లు, -0.330 నెట్‌ రన్‌రేట్ తో ఉంది.

ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ తరఫున కెప్టెన్ హష్మతుల్లా షాహిది, రహ్మత్ షా హాఫ్ సెంచరీలతో రాణించారు. హష్మతుల్లా 56 పరుగులతో అజేయంగా నిలవగా.. రహ్మత్ షా 52 రన్స్ చేశాడు. అజ్మతుల్లా జజాయ్ 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించడంతో ఆఫ్ఘనిస్థాన్ నెట్ రన్ రేట్ చాలా మెరుగైంది.

ఆఫ్ఘన్ విజయం ఒక రకంగా పాకిస్థాన్ కు షాక్ లాంటిదే. శనివారం (నవంబర్ 4) న్యూజిలాండ్ తో డూ ఆర్ డైలాంటి మ్యాచ్ ఆడబోతున్న పాక్ టీమ్.. ఆఫ్ఘన్ ఓటమిని కోరుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ టీమ్ 46. 3 ఓవర్లలో కేవలం 179 పరుగులకే ఆలౌటైంది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెట్ మాత్రమే 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ 42 రన్స్ చేశాడు.

Whats_app_banner