Cricket Rules: వన్డే, టీ20 క్రికెట్‌లో కీలక మార్పులు చేసిన ఐసీసీ.. అలా చేస్తే 5 రన్స్ పెనాల్టీ
21 November 2023, 19:09 IST
- Cricket Rules: వన్డే, టీ20 క్రికెట్‌లో కీలక మార్పులు చేసింది ఐసీసీ. మంగళవారం (నవంబర్ 21) అహ్మదాబాద్ లో జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్ లో మ్యాచ్ లు ఆలస్యం కాకుండా ఉండేలా కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఓవర్ల మధ్య ఆలస్యాన్ని తగ్గించడానికి ఐసీసీ కీలక నిర్ణయం
Cricket Rules: క్రికెట్ మ్యాచ్ లు ఆలస్యం కాకుండా చూడటానికి ఐసీసీ కొన్ని కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఓవర్ కు మధ్య ఫీల్డింగ్ టీమ్స్ కు 60 సెకన్ల సమయం ఇవ్వాలన్నది తాజా నిర్ణయాల్లో ముఖ్యమైనది. అయితే బౌలింగ్ టీమ్స్ ఇంత కన్నా ఎక్కువ సమయం తీసుకుంటే పెనాల్టీ విధించాలని కూడా చెప్పడం గమనార్హం.
ప్రతి ఓవర్ కు మధ్య గరిష్ఠంగా 60 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. అంటే ఓ ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపే మరో ఓవర్ ప్రారంభం కావాలి. ఒకవేళ మూడుసార్లు ఆ సమయాన్ని మించితే బౌలింగ్ జట్టుకు పెనాల్టీ విధిస్తూ బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు ఇస్తారు. మంగళవారం (నవంబర్ 21) అహ్మదాబాద్ లో సమావేశమైన ఐసీసీ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
క్రికెట్ ఫీల్డ్ లో స్టాప్ వాచ్
మ్యాచ్ లు మరీ ఆలస్యంగా ముగుస్తున్న నేపథ్యంలో ఐసీసీ ఈ కఠిన నిబంధన అమలు చేయాలని భావిస్తోంది. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ప్రయోగాత్మకంగా ఈ కొత్త నిబంధన అమలు చేస్తారు. ఓవర్ ఓవర్ కు మధ్య టైమ్ ఎంత గడుస్తుందన్నది చూడటానికి స్టాప్ వాచ్ కూడా ఉపయోగించనున్నారు. ఒక ఓవర్ ముగియగానే ఈ స్టాప్ వాచ్ మొదలవుతుంది.
60 సెకన్లలోపు మరో ఓవర్ ప్రారంభం అవుతుందా లేదా అన్నది ఈ వాచ్ ద్వారా అంపైర్లు సులువుగా గుర్తించే వీలుంటుంది. ఇక పిచ్, ఔట్‌ఫీల్డ్ నిబంధనలకూ మార్పులు చేశారు. పిచ్ ను అంచనా వేసే ప్రమాణాలను సులభతరం చేశారు. ఇన్నాళ్లూ ఐదు డీమెరిట్ పాయింట్లు ఉన్న స్టేడియాన్ని సస్పెండ్ చేసేవారు. ఇక నుంచి దీనిని ఆరు పాయింట్లకు పెంచాలని నిర్ణయించారు.