ENG vs AFG: ప్రపంచకప్‍లో సంచలనం.. ఇంగ్లండ్‍ను ఓడించిన అఫ్గానిస్థాన్
15 October 2023, 22:05 IST
- ENG vs AFG ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో అఫ్గానిస్థాన్ దుమ్మురేపింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‍ను ఓడించి సంచలనం నమోదు చేసింది.
ENG vs AFG: ప్రపంచకప్‍లో సంచలనం.. ఇంగ్లండ్‍ను ఓడించిన అఫ్గానిస్థాన్
ENG vs AFG ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో సంచలనం నమోదైంది. పసి కూనగా టోర్నీలో ఉన్న అఫ్గానిస్థాన్.. ఏకంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‍ను చిత్తుచేసింది. ప్రపంచకప్‍లో భాగంగా ఢిల్లీలో నేడు (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‍లో అఫ్గానిస్థాన్ 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‍పై విజయం సాధించింది.
ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (80), ఇక్రమ్ అలిఖిల్ (58) అర్ధ శతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు, మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశారు. అఫ్గానిస్థాన్ బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‍కు షాక్ ఎదురైంది. 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటై పరాజయాన్ని మూటగట్టుకుంది. హ్యారీ బ్రూక్ (66) మినహా మరే ఇంగ్లండ్ బ్యాటర్ కూడా రాణించలేకపోయారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో స్పిన్నర్లు ముజీబుర్ రహ్మాన్, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీసుకొని ఇంగ్లిష్ జట్టును కుప్పకూల్చారు. మహమ్మద్ నబీ రెండు, నవీనుల్ హక్, ఫజల్ హక్ ఫారుకీ చెరో వికెట్ తీశారు. ఏ ఫార్మాట్‍లో అయినా ఇంగ్లండ్‍పై అఫ్గానిస్థాన్‍ను ఇదే తొలి విజయంగా ఉంది.
తిప్పేసిన అఫ్గాన్ స్పిన్ త్రయం
అఫ్గానిస్థాన్ స్పిన్నర్లు ముజీబుర్ రహ్మన్, రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ సత్తాచాటడంతో లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో (2)ను రెండో ఓవర్లోనే అఫ్గాన్ పేసర్ ఫజల్లాక్ ఫారుకీ ఔట్ చేశాడు. జో రూట్ (11)ను స్పిన్నర్ ముజీబుర్ రహ్మన్ బౌల్డ్ చేశాడు. నిలకడగా ఆడుతున్న డేవిడ్ మలన్ (33)ను నబీ ఔట్ చేశాడు. కాసేపటి ఇంగ్లిష్ స్టార్ జోస్ బట్లర్(9)ను అఫ్గాన్ పేసర్ నవీనుల్ హక్ బౌల్డ్ చేశాడు. దీంతో 17.2 ఓవర్లలో 91 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లండ్.
ఇంగ్లండ్ బ్యాటర్ బ్యారీ బ్రూక్ మాత్రం మరో ఎండ్‍లో ఒంటరి పోరాటం చేశాడు. కాసేపటికే లియామ్ లివింగ్ స్టోన్ (10)ను రషీద్ ఖాన్.. సామ్ కరన్ (10)ను మహమ్మద్ నబీ పెవిలియన్‍కు పంపారు. మరో ఎండ్‍లో దూకుడుగా ఆడిన బ్రూక్ 45 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. క్రిస్ వోక్స్(9)ను ఔట్ చేసిన ముజీబ్.. కాసేపటికే బ్రూక్‍ను కూడా పెవిలియన్‍కు పంపి ఇంగ్లండ్‍ను భారీ దెబ్బ తీశాడు. ఆదిల్ రషీద్ (20), మార్క్ వుడ్ (18)ను రషీద్ ఔట్ చేశాడు. దీంతో 40.3 ఓవర్లలో 215 పరుగులు చేసి ఆలౌటై.. పరాజయం పాలైంది ఇంగ్లండ్.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ సత్తాచాటింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 57 బంతుల్లో 80 పరుగులతో అదరగొట్టాడు. ఇక్రమ్ అలీఖిల్ నిలకడైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. చివర్లో ముజీబుర్ రహ్మాన్ 16 బంతుల్లోనే 28 పరుగులు చేసి రాణించాడు. మొత్తంగా 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసింది అఫ్గానిస్థాన్.
మూడు వికెట్లతో పాటు బ్యాటింగ్‍లో 28 పరుగులు చేసిన అఫ్గాన్ స్పిన్నర్ ముజీబుర్ రహ్మాన్‍కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.