ENG vs AFG: గుర్బాజ్ మెరుపులు.. ఇంగ్లండ్‍కు మోస్తరు టార్గెట్ ఇచ్చిన అఫ్గానిస్థాన్
ENG vs AFG World Cup 2023 Match 13: ఇంగ్లండ్‍తో మ్యాచ్‍లో బ్యాటింగ్‍లో రాణించింది అఫ్గానిస్థాన్. ఇంగ్లిష్ జట్టుకు మోస్తరు టార్గెట్‍ను ఇచ్చింది.
ENG vs AFG World Cup 2023 Match 13: ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్‍కు మంచి టార్గెట్‍ను నిర్దేశించింది అఫ్గానిస్థాన్. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా నేడు (అక్టోబర్ 15) ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో అఫ్గానిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది.
49.5 ఓవర్లలో 284 పరుగులకు అఫ్గాన్ ఆలౌటైంది. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80 పరుగులు; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇక్రమ్ అలిఖిన్ (66 బంతుల్లో 58 పరుగులు) అర్ధ శతకాలతో సత్తాచాటారు. గుర్బాజ్ మెరుపులతో ఓ దశలో వికెట్ కోల్పోకుండా 12.4 ఓవర్లకే 100 పరుగులు చేసింది అఫ్గాన్. అయితే, ఆ తర్వాత ఆ జోరు కొనసాగలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు, మార్క్ వుడ్ రెండు, టోప్లే, లివింగ్ స్టోన్, జో రూట్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ముందు 285 పరుగుల లక్ష్యం ఉంది.
గుర్బాజ్ ధనాధన్..
తొలుత బ్యాటింగ్‍కు దిగిన అఫ్గానిస్థాన్‍కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్ (28) శుభారంభం చేశారు. గుర్బాజ్ ప్రారంభం నుంచి హిట్టింగ్‍కు దిగాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుపడ్డాడు. గుర్బాజ్ దూకుడుతో 10 ఓవర్లలోనే అఫ్గానిస్థాన్ 79 పరుగులు చేసింది. మరో ఎండ్‍లో జర్దాన్ నిలకడగా ఆడాడు. అదే జోరు కొనసాగించిన గుర్బాజ్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు. 12.4 ఓవర్లలోనే స్కోరు 100 పరుగులు దాటింది. అయితే, జర్దాన్‍ను ఔట్ చేసి ఇంగ్లండ్‍కు బ్రేక్ ఇచ్చాడు స్పిన్నర్ ఆదిల్ రషీద్. వెంటనే రహ్మత్ షా (3)ను కూడా రషీద్ పెవిలియన్‍కు పంపాడు. దూకుడుగా ఆడుతున్న గుర్బాజ్ రనౌట్ అవడంతో అఫ్గానిస్థాన్‍కు ఎదురుదెబ్బ తగిలింది.
అనంతరం అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది (14), అజ్మతుల్లా ఒమర్ జాయ్ (19) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. అయితే, ఇక్రమ్ అలీఖిల్ నిలకడగా ఆడాడు. క్రమంగా స్కోరు బోర్డును నడిపాడు. ఈ క్రమంలో 45.5 ఓవర్లలో 250 పరుగులకు చేరింది అఫ్గానిస్థాన్. 61 బంతుల్లో హాఫ్ సెంచరీ చేరిన ఇక్రమ్ కాసేపటికి ఔటయ్యాడు. చివర్లో రషీద్ ఖాన్ (22), ముజీబుల్ రహ్మన్ (28) రాణించి.. విలువైన పరుగులు జోడించారు. దీంతో 49.5 ఓవర్లలో అఫ్గాన్ 284 పరుగులు చేయగలిగింది.