తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: “ఇదే బెస్ట్ అని చెప్పలేను.. అప్పుడు ఆ ముగ్గురు కూడా..”: భారత బౌలింగ్‍‍పై సౌరవ్ గంగూలీ కామెంట్లు

Team India: “ఇదే బెస్ట్ అని చెప్పలేను.. అప్పుడు ఆ ముగ్గురు కూడా..”: భారత బౌలింగ్‍‍పై సౌరవ్ గంగూలీ కామెంట్లు

11 November 2023, 16:48 IST

google News
    • Ganguly on Team India: భారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుత బౌలింగ్ దళం అత్యుత్తమమైనది అని చెప్పలేనని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఎందుకో కూడా చెప్పారు.
సౌరవ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ

సౌరవ్ గంగూలీ

Ganguly on Team India: ప్రస్తుత వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో టీమిండియా అజేయ యాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‍ల్లో గెలిచి సెమీ ఫైనల్‍కు అర్హత సాధించింది. చివరి లీగ్ దశ మ్యాచ్‍లో నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడనుంది. సెమీస్‍లో న్యూజిలాండ్‍తో టీమిండియా తలపడడం దాదాపు ఖరారైంది. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానం కూడా పదిలమైంది. ఈ ప్రపంచకప్‍లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అదరగొడుతోంది. ముఖ్యంగా పేసర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నారు.

ఈ టోర్నీలో షమీ, బుమ్రా, సిరాజ్ ముగ్గురూ కలిసి 41 వికెట్లు పడగొట్టారు. నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నారు. దీంతో భారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుత బౌలింగ్ దళమే అత్యుత్తమమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు.

భారత పరిమిత ఓవర్ల క్రికెట్‍లో ప్రస్తుత బౌలింగ్ అటాకే బెస్ట్ ఎవర్ అని తాను చెప్పలేనని గంగూలీ అన్నారు. ఇందుకు 2003 వన్డే ప్రపంచకప్‍ను గుర్తు చేశారు. ఆ టోర్నీలో భారత పేసర్లు ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ కూడా అప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేశారని గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

“దీన్ని ఆల్‍టైమ్ అత్యుత్తమ ఇండియన్ పేస్ అటాక్ అని నేను చెప్పలేను. 2003 ప్రపంచకప్‍లో నెహ్రా, జహీర్, శ్రీనాథ్ కూడా అమోఘంగా బౌలింగ్ చేశారు” అని గంగూలీ చెప్పారు. అయితే, ప్రస్తుత బౌలింగ్ దళంపై మాత్రం ప్రశంసలు కురిపించారు.

“కానీ, ప్రస్తుతం బుమ్రా, షమీ, సిరాజ్‍ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బుమ్రా టీమ్‍లో ఉంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండు ఎండ్‍ల నుంచి ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెట్టవచ్చు. మిగిలిన ఇద్దరు బౌలర్లపై కూడా బుమ్రా ప్రభావం ఎక్కువగా ఉంటోంది” అని గంగూలీ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ప్రపంచకప్‍లో మహమ్మద్ షమీని టీమిండియా ముందుగానే తుది జట్టులోకి తీసుకోవాల్సిందని గంగూలీ అన్నారు. “చాలా ముందుగానే తుది జట్టులో షమీ ఆడాల్సింది. అతడు ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాడో తెలుస్తోంది కదా” అని గంగూలీ చెప్పారు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా దూరమవటంతో ప్రపంచకప్‍లో భారత తుది జట్టులో షమీకి చోటు దక్కింది. అప్పటి నుంచి షమీ అదరగొడుతూనే ఉన్నాడు.

ప్రపంచకప్‍లో తన లీగ్ దశ చివరి మ్యాచ్‍ను బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఆదివారం (నవంబర్ 12) భారత్ ఆడనుంది. నవంబర్ 15న తొలి సెమీస్‍లో న్యూజిలాండ్‍తో టీమిండియా తలపడడం దాదాపు ఖరారైంది.

తదుపరి వ్యాసం