Aus vs Pak: పాకిస్థాన్ టీమ్‌కు చేదు అనుభవం.. క్షమాపణ చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు
07 December 2023, 20:23 IST
- Aus vs Pak: పాకిస్థాన్ టీమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా టూర్లో భాగంగా వామప్ మ్యాచ్ ఆడుతున్న పాక్ టీమ్ ను స్కోరు కార్డులో పాకీ అని వ్యవహరించడం దుమారం రేపింది.
స్కోరుకార్డులో పాకిస్థాన్ టీమ పేరును పాకీ అని రాశారు
Aus vs Pak: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడి ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో వామప్ మ్యాచ్ ఆడుతోంది. అయితే బుధవారం (డిసెంబర్ 6) తొలి రోజు ఆటలో పాక్ టీమ్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్కోరు కార్డులో ఆ టీమ్ పేరును పాకీ (Paki) అని రాశారు. ఈ విషయాన్ని ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ చెప్పే వరకూ ఎవరూ గమనించలేదు.
పాకిస్థాన్ టీమ్ ను సాధారణంగా స్కోరు కార్డులో పాక్ (Pak)గా పిలుస్తారు. కానీ పాకీ అనడం జాతి వివక్ష కిందికే వస్తుంది. ఇదే విషయాన్ని చెబుతూ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఆ స్కోరు కార్డును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన క్రికెట్ ఆస్ట్రేలియా వెంటనే తప్పును సరిదిద్దుకొని క్షమాపణలు చెప్పడం గమనార్హం.
స్కోరుకార్డులో పాకీ అని ఉండటాన్ని మొదట గమనించిన జర్నలిస్ట్ పేరు డానీ సయీద్. ఫాక్స్ ఛానెల్ చేసిన పొరపాటును అతడు బయటపెట్టాడు. పాక్ స్థానంలో పాకీ అని ఉంచడం సరి కాదంటూ అతడు ట్వీట్ చేశాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందిస్తూ.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
"ఈ గ్రాఫిక్ డేటా ప్రొవైడర్ అందించిన ఆటోమేటిక్ ఫీడ్. గతంలో పాకిస్థాన్ మ్యాచ్ కు ఉపయోగించలేదు. ఇది నిజంగా చింతించాల్సిన విషయం. ఇది తెలియగానే ఆ పొరపాటును మేము సరిద్దాం" అని క్రికెట్ ఆస్ట్రేలియా ఇచ్చిన వివరణను కూడా డానీ సయీద్ ట్వీట్ చేశాడు. పాకిస్థాన్ లో లేదా దక్షిణాసియాలో జన్మించిన వ్యక్తిని జాతి వివక్షకు గురి చేసేలా పాకీ అని పిలుస్తారు.
ఇక ఈ వామప్ మ్యాచ్ విషయానికి వస్తే పాక్ కెప్టెన్ షాన్ మసూద్ 201 రన్స్ చేయడంతో ఆ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 391 రన్స్ చేసింది. ఆ తర్వాత రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 149 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్ లో పాక్ తలపడనుంది. తొలి టెస్ట్ డిసెంబర్ 14 నుంచి 18 వరకు పెర్త్ లో జరుగుతుంది. తర్వాత డిసెంబర్ 26న రెండో టెస్ట్, జనవరి 3న మూడో టెస్ట్ జరుగుతాయి.