YouTube Create : ‘యూట్యూబ్ క్రియేట్’ లాంచ్.. ఇక వీడియో ఎడిటింగ్ చాలా ఈజీ!
22 September 2023, 11:40 IST
YouTube Create : యూట్యూబ్ క్రియేట్ అనే పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం. ఈ యాప్‌తో సింపుల్‌గా వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
యూట్యూబ్ క్రియేట్ లాంచ్.. ఇక వీడియో ఎడిటింగ్ చాలా ఈజీ!
YouTube Create : మీకు యూట్యూబ్ ఛానెల్ ఉందా? వీడియో ఎడిటింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చేసింది! కొత్తగా ఓ వీడియో ఎడిటింగ్ యాప్‌ను లాంచ్ చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం యూట్యూబ్. దీని పేరు యూట్యూబ్ క్రియేట్. ఇండియా, యూకే, ఫ్రాన్స్, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌లో ఈ ఏఐ ఆధారిత యాప్‌నకు చెందిన ఆండ్రాయిడ్ బీటా వర్షెన్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఇది ఐఓఎస్‌కు అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా ఇది లాంచ్ అవ్వనుంది.
గురువారం జరిగిన మేడ్ ఆన్ యూట్యూబ్ ఈవెంట్లో ఈ యూట్యూబ్ క్రియేట్‌ను లాంచ్ చేసింది సంస్థ. ఎవరైనా సులభంగా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యాప్‌ను తీసుకొచ్చినట్టు వెల్లడించింది.
YouTube Create video editing : "వీడియోలు తయారు చేయడం వెనుక ఉండే కష్టం గురించి మాకు తెలుసు. మరీ ముఖ్యంగా కంటెంట్ క్రియేషన్ జర్నీని ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్న వారికి ఇది మరింత కష్టంగా ఉంటుంది. వీడియో ఎడిటింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకే.. యూట్యూబ్ క్రియేట్ యాప్‌ను తీసుకొచ్చాము. ఇదొక మొబైల్ యాప్," అని గూగుల్ ఆధారిత సంస్థ వెల్లడించింది. ఇదొక ఫ్రీ యాప్ అని, షార్ట్స్, లాంగ్ ఫార్మాట్ వీడియోలను ఇందులో చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- ITR for YouTube Income: ‘యూట్యూబ్’ ఆదాయానికి కూడా ఐటీఆర్ దాఖలు చేయాలా?
అంతేకాకుండా.. ఈ యాప్‌నకు కృత్రిమ మేథ శక్తిని కూడా జోడించింది యూట్యూబ్. ఏడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమెటిక్ కాప్షనింగ్, వాయిస్ఓవర్, ట్రాన్సీషన్స్ వంటివి ఏఐ ఆధారంగా చేసుకోవచ్చు. బీట్ మ్యాచింగ్ టెక్నాలజీతో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ని కూడా ఈ యూట్యూబ్ క్రియేట్‌లో పొందొచ్చు.
YouTube Create app : 3వేలకుపైగా మంది యూట్యూబ్ క్రియేటర్లను సంప్రదించి, వారి నుంచి ఫీడ్‌బ్యాంక్ పొందిన తర్వాత.. ఈ యాప్‌ను రూపొందించినట్టు సంస్థ చెప్పింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూనే ఉంటామని హామీనిచ్చింది.
'ఏఐ'తో ఎడిటింగ్..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకుని ఓ కొత్త ఫీచర్‌పై పరీక్షలు చేస్తున్నట్టు యూట్యూబ్ వెల్లడించింది. ఈ డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మనం ఏది టైప్ చేస్తే అది మన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లోకి వచ్చేస్తుందని తెలిపింది.
"కొంతమంది క్రియేటర్లకు ఈ డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ ఇస్తాము. వచ్చే ఏడాదిలో పూర్తిస్థాయిలో అందరికి ఇస్తాము," అని యూట్యూబ్ ప్రకటించింది.