Srimanthudu YouTube Record: యూట్యూబ్‍లో శ్రీమంతుడు సినిమా రికార్డు.. ఆ మైలురాయి చేరిన తొలి తెలుగు మూవీగా..
Srimanthudu YouTube Record: శ్రీమంతుడు చిత్రం యూట్యూబ్‍లో రికార్డు నెలకొల్పింది. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా 2015లో థియేటర్లలో రిలీజై అప్పట్లో భారీ కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు యూట్యూబ్‍లోనూ ఓ అరుదైన మైలురాయిని దాటింది.
Srimanthudu YouTube Record: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా 2015లో రిలీజై సూపర్ హిట్ అయింది. అప్పట్లోనే రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‍గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే ‘గ్రామాలను దత్తత తీసుకోవడం’ అనేది పాపులర్ అయింది. సోషల్ మెసేజ్‍తోనే పక్కా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఎనిదేళ్ల తర్వాత యూట్యూబ్‍లో శ్రీమంతుడు మరో రికార్డు సృష్టించింది.
శ్రీమంతుడు ఫుల్ మూవీ యూట్యూబ్‍లో తాజాగా 200 మిలియన్స్ (20కోట్ల) వ్యూస్‍ను దాటింది. యూట్యూబ్‍లో 200 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న తొలి తెలుగు చిత్రంగా శ్రీమంతుడు రికార్డు సృష్టించింది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పుడు కూడా శ్రీమంతుడు రికార్డు సృష్టించిందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ తన యూట్యూబ్ ఛానెల్‍లో 2017 సెప్టెంబర్ 13వ తేదీన శ్రీమంతుడు పూర్తి సినిమాను అప్‍లోడ్ చేసింది. అప్పటి నుంచి ఈ చిత్రానికి వ్యూస్ భారీగా వచ్చాయి. దీంతో ఈ మూవీని అప్‍లోడ్ దాదాపు ఐదేళ్లు అవుతుండగా.. ఇప్పుడు ఏకంగా 200 మిలియన్స్ వ్యూస్ మార్కును దాటింది. ఈ మూవీకి యూట్యూబ్‍లో 8.3లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు లుక్, సెటిల్డ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. డైరెక్టర్ కొరటాల శివ టేకింగ్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‍గా నటించగా.. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సంపత్ నంది, రాహుల్ రవీంద్రన్, అలీ, వెన్నెల కిశోర్, సుకన్య కీలకపాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. శ్రీమంతుడు పాటలు మంచి హిట్ అయ్యాయి.
మైత్రీ మూవీ మైకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్, సీవీ మోహన్ శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌తో ఈ సినిమా నిర్మాణంలో మహేశ్ బాబు కూడా భాగస్వాములయ్యారు. శ్రీమంతుడు చిత్రానికి చాలా రంగాల ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం స్ఫూర్తితోనే చాలా మంది సినీ, రాజకీయ సహా ఇతర రంగాలకు చెందిన వారు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు.