Xiaomi 13, iQoo 11 Series: షావోమీ13, ఐకూ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‍ల లాంచ్ వాయిదా.. కారణం ఇదే!
01 December 2022, 18:15 IST
- Xiaomi 13 Series, iQoo 11 Series launch postponed: షావోమీ 13 సిరీస్, ఐకూ 11 సిరీస్ చైనా లాంచ్ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని ఆ కంపెనీలు అధికారికంగా ప్రకటించాయి.
Xiaomi 13, iQoo 11 launch: షావోమీ13, ఐకూ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‍ల లాంచ్ వాయిదా.. కారణం ఇదే! (Photo:Xiaomi)
Xiaomi 13 Series, iQoo 11 Series launch postponed: షావోమీ, ఐకూ కంపెనీలు తదుపరి సిరీస్ ఫ్లాగ్‍షిప్ ఫోన్లను లాంచ్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో అవాంతరం ఎదురైంది. షావోమీ 13 సిరీస్ చైనా లాంచ్‍ను వాయిదా వేస్తున్నట్టు షావోమీ ప్రకటించింది. నేడు (డిసెంబర్ 1) ఈ ఈవెంట్ జరగాల్సింది. మరోవైపు ఐకూ 11 సిరీస్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఐకూ పేర్కొంది. ఈ సిరీస్ ఈనెల 2న చైనాలో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే లాంచ్‍ను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించిన రెండు కంపెనీలు తదుపరి తేదీలను మాత్రం ప్రకటించలేదు.
కారణం ఇదేనా!
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (Jiang Zemin) బుధవారం మృతి చెందారు. లాంచ్ ఈవెంట్‍లను షావోమీ, ఐకూ వాయిదా వేసేందుకు ఇది కారణం అయి ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. 1993 నుంచి 2003 వరకు చైనాకు పదేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు జెమిన్. ప్రపంచ శక్తిగా చైనా ఎదగటంలో ఆయన పాత్ర కీలకంగా ఉంది. దీంతో ఆయన మృతికి సంతాపంగా షావోమీ, ఐకూ లాంచ్ ఈవెంట్లను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.
షావోమీ 13 సిరీస్
Xiaomi 13 Series: స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ సహా ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో షావోమీ 13 సిరీస్ మొబైళ్లు రానున్నాయి. ఈ సిరీస్‍లో.. షావోమీ 13, షావోమీ 13 ప్రో రానున్నాయి. 2కే డిస్‍ప్లేతో పాటు ప్రీమియమ్ కెమెరాలను ఈ ఫోన్లు కలిగి ఉంటాయి. ఈ మొబైళ్లతో పాటు ఎంఐయూఐ 14, షావోమీ వాచ్ ఎస్2, షావోమీ బడ్స్ 4 టీడబ్ల్యూఎస్ ఇయర్‍బడ్స్ ను డిసెంబర్ 1న లాంచ్ చేయనున్నట్టు షావోమీ ప్రకటించింది. అయితే హఠాత్తుగా ఈవెంట్‍ను వాయిదా వేసింది.
ఐకూ 11 సిరీస్
iQoo 11 Series: ఐకూ 11 సిరీస్‍లోనూ ఐకూ 11, ఐకూ 11 ప్రో మొబైళ్లు లాంచ్ కావాల్సి ఉంది. డిసెంబర్ 2ను లాంచ్ డేట్‍గా ఐకూ ప్రకటించగా.. తాజాగా ఈవెంట్‍ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఐకూ 11 ప్రో ఫోన్ 200 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని ఐకూ తాజాగా ప్రకటించింది. 2కే ఈ6 అమోలెడ్ 144 హెర్ట్జ్ ఫ్లాగ్‍షిప్ డిస్‍ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. వెనుక నాలుగు కెమెరాలు.. ఫ్లాగ్‍షిప్ లెన్స్ లతో ఉంటాయి. ఐకూ 11 సిరీస్ ఫోన్లలో కూడా కూడా స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ఫ్లాగ్‍షిప్ ప్రాసెసర్ ఉంటుంది.