ULI : యూపీఐలా యూఎల్ఐ.. ఇక రుణాలు తీసుకోవడం చిటికెలో పని!
26 August 2024, 15:05 IST
RBI ULI : రుణాలు తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పేపర్ వర్క్ కోసం నానా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇకపై ఇలాంటి సమస్యలు తగ్గనున్నాయి. ఎందుకంటే ఆర్‌బీఐ యూఎల్ఐ సేవలను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. అసలు యూఎల్ఐ అంటే ఏంటో చూద్దాం..
యూఎల్ఐపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
యూపీఐ సేవలు భారతదేశంలో నగదు చెల్లింపు వ్యవస్థలో పెద్ద మార్పు. ఎవరూ ఊహించని విధంగా రిజర్వ్ బ్యాంక్ ఈ సేవలను తీసుకొచ్చింది. అయితే మరో విప్లవాత్మక మార్పునకు ఆర్బీఐ సిద్ధమైంది. యూపీఐలాగా యూఎల్ఐ సేవలను ప్రారంభించనుంది. అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్(ULI). త్వరలో దీనిని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది రిజర్వ్ బ్యాంక్.
ఇలాంటి పద్ధతితో చిన్న, గ్రామీణ రుణగ్రహీతలు సులభంగా రుణాలు తీసుకోనున్నారు. భారతదేశంలో రుణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుంది.
నిజానికి గతేడాది ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ పేరుతో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఇది సక్సెస్ అవ్వడంతో దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. బెంగళూరులో జరిగిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో శక్తికాంత దాస్ మాట్లాడారు.
'యూపీఐతో చెల్లింపుల వ్యవస్థ మారింది. ఆ విధంగానే భారతదేశంలో రుణాల మంజూరు విషయంలో మార్పునకు యూఎల్ఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాం. భారతదేశంలో JAM- UPI-ULIలు చాలా కీలకం. డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక విప్లవాత్మక ముందడుగు.' అని ఆర్బీఐ గవర్నర్ అన్నారు.
భూ రికార్డులతోపాటుగా ఇతర ముఖ్యమైన డిజిటల్ సమాచారం ఆధారంగా యూఎల్ఐ నడవనుంది. రుణాలకు అంతరాయం లేని విధంగా ఈ వ్యవస్థను తీసుకురానున్నారు. రుణాల అనుమతులకు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రుణగ్రహీతలు తక్కువ డాక్యుమెంటేషన్‌తో త్వరితగతిన రుణాలు పొందేందుకు ఈ వ్యవస్థ అనుమతిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక, ఆర్థికేతర డేటాను డిజిటలైజ్ చేయడం ద్వారా యూఎల్ఐ వివిధ రంగాలలో ముఖ్యంగా వ్యవసాయ, ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలకు రుణం కోసం డిమాండ్‌ను తీర్చగలదని ఆశిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.
ఈ సందర్భంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) విజయం గురించి కూడా ఆర్భీఐ గవర్నర్ మాట్లాడారు. 'భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ప్రస్తుతం అందరికీ సులభతరం అయ్యాయి. వ్యాపారాలు, వ్యక్తులకు మధ్య పెద్ద, తక్కువ మెుత్తంలోనూ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఉంది. వెంటనే డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు సురక్షితమైన విధానాన్ని అందిస్తుంది యూపీఐ.' అని పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ దాస్ చెప్పారు. మన ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే విధానాలు, వ్యవస్థలు, వేదికలను రూపొందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు.