Digital India : 1976 టూ 2024.. వాట్ ఏ జర్నీ ఇండియా.. డిజిటల్ రంగంలో ఊహించని మార్పులు-independence day special from 1976 to 2024 know how india growth in digital technology compare to other countries ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Digital India : 1976 టూ 2024.. వాట్ ఏ జర్నీ ఇండియా.. డిజిటల్ రంగంలో ఊహించని మార్పులు

Digital India : 1976 టూ 2024.. వాట్ ఏ జర్నీ ఇండియా.. డిజిటల్ రంగంలో ఊహించని మార్పులు

Anand Sai HT Telugu
Aug 15, 2024 02:12 PM IST

Independence Day Special : భారతదేశం 78వ స్వాతంత్య్ర వేడుకల్లో ఉంది. ఈ సందర్భంగా ఇండియాలో డిజిటల్ రంగంలో వచ్చిన మార్పుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కనీసం ఫోన్ కూడా లేని గ్రామాల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకూ భారత్ ఎదిగింది. ఇది గర్వించద్గగ విషయం. రెండు దశాబ్దాలలో ఎవరూ ఊహించని మార్పులు వచ్చాయి.

డిజిటల్ ఇండియా
డిజిటల్ ఇండియా (Unsplash)

ఇండియాలో డిజిటల్ రంగంలో ఎవరూ ఊహించని మార్పులు వచ్చాయి. భారతదేశం డిజిటల్ విప్లవం దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజం, పాలనను పునర్నిర్మించడంలో ఎంతో సాయపడిందని చెప్పాలి. 1990ల ముందు డిజిటల్ విప్లవం ఎక్కువగా లేదు. ఎప్పుడైతే 2000లలోకి ఎంటర్ అయ్యామో.. అప్పుడు ఫోన్లతో మెుదలైంది. 2010 వరకు ఊపందుకుంది. ఇప్పుడు ఫోన్ లేని గ్రామం లేదు. ఇంటింటికి సెల్ ఫోన్.. అందులో డిజిటల్ పేమెంట్స్.

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ప్రాథమిక అవసరాల్లో ముఖ్యమైపోయాయి. అవి లేకుండా బయటకు వెళ్లాలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. . భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు తమ స్థావరాన్ని విస్తరించుకున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ డిజిటల్ రంగం భారత్‌లో అభివృద్ధి చెందింది.

ఎన్ఐసీ స్థాపన

భారతదేశం డిజిటల్ విప్లవం 1976 నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ స్థాపన, ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లను ప్రవేశపెట్టడంతో ప్రారంభమైంది. 1991లో ఆర్థిక సరళీకరణ వేగవంతమైన సాంకేతిక అభివృద్ధికి వేదికగా నిలిచింది. సరళీకరణ విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్లు, పెట్టుబడులను ఆకర్శించాయి. ఇది ఐటీ పరిశ్రమ వృద్ధికి ఊతమిచ్చింది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలుగా ఎదగడం ప్రారంభించాయి. ఇది టెక్నాలజీ అవగాహనను మెల్లగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరించింది.

టెలికాం పాలసీ

భారతదేశం డిజిటల్ అభివృద్ధిలో ముఖ్యమైన సంవత్సరం 2000ల ప్రారంభంలో మొబైల్ ఫోన్‌ల అభివృద్ధితో వచ్చింది. సరసమైన మొబైల్ ఫోన్‌ల పరిచయం, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల విస్తరణ దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్‌లను వాడేలా చేసింది. 1999లో భారత ప్రభుత్వ జాతీయ టెలికాం పాలసీ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడం ద్వారా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది పోటీ, ఆవిష్కరణ, తక్కువ ఖర్చుతో ఫోన్లను ప్రోత్సహించింది.

3జీ, 4జీ నెట్‌వర్క్‌లు

ఆ తర్వాత భారతదేశం మొబైల్ ఫోన్‌ల కోసం ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా మారింది. ఆ తర్వాత డిజిటల్ రంగంలో ఎవరూ ఊహించని మార్పులు వచ్చాయి. భారతదేశ డిజిటల్ ప్రయాణంలో కొత్త శకం ప్రారంభమైంది. 2010 తర్వాత 3G, 4G నెట్‌వర్క్‌లకు వెళ్లింది. తర్వాత రిలయన్స్ జియో భారతదేశ ప్రజలకు తక్కువ ఖర్చుతో అనేక ఉచిత సేవలను ప్రవేశపెట్టింది. ఉచిత వాయిస్ కాల్‌లు, అతి తక్కువ ధర డేటాను అందించడం ద్వారా, Jio ఇంటర్నెట్ యాక్సెస్‌తో చాలామంది వీటివైపు మెుగ్గు చూపారు. కోట్ల మంది భారతీయులను ఆన్‌లైన్‌లోకి వచ్చారు.

డిజిటల్ ఇండియా

తర్వాత క్రమక్రమంగా జనాలు సోషల్ మీడియా, ఇ-కామర్స్ నుండి స్థానిక ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వరకు వెళ్లారు. భారత ప్రభుత్వం 2015లో డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్‌ను ప్రారంభించింది. భారతదేశాన్ని డిజిటల్ వైపు తీసుకెళ్లి ప్రపంచంలోనే టాప్‌గా ఉంచడం దీని ఉద్దేశం. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ సర్వీసెస్, డిజిటల్ ఎడ్యుకేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. భారత్ నెట్ వంటి ప్రాజెక్టులతో మొత్తం 2,50,000 గ్రామ పంచాయతీలు హైస్పీడ్ ఇంటర్నెట్‌తో అనుసంధానించారు. డిజిటల్ గుర్తింపు కోసం ఆధార్ వ్యవస్థను ప్రారంభించారు. తర్వాత బయోమెట్రిక్ గుర్తింపు అయిన ఆధార్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థగా మారింది.

యూపీఐ పేమెంట్స్

డిజిటల్ విప్లవంలో మరో ముఖ్యమైన అంశం డిజిటల్ చెల్లింపుల పెరుగుదల. చేతిలో నగదు కంటే ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2016లో భారతదేశంలో డీమోనిటైజేషన్ నుండి ఇది ఎక్కువైంది. 2016లో ప్రారంభించబడిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతదేశంలో ఎవరూ అనుకోని మార్పు. ఇది ఓ మైలురాయిగా చెప్పవచ్చు. UPI డిజిటల్ చెల్లింపులను అందరికీ సులభంగా, వేగంగా చేసింది. నగదు రహిత లావాదేవీలను పట్టణ ప్రజలతోపాటుగా గ్రామీణ ప్రజలు ఎక్కువే చేస్తున్నారు.

ఇప్పుడు ఇండియా 5జీ నుంచి 6జీ వైపు ప్రయాణిస్తోంది. టెక్నాలజీలో భారత్ ఇతర దేశాలకంటే ముందు వరుసలో ఉండాలని ఆశీద్దాం..