భారత్‌లో ఈ ట్యాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా? కోట్లు సంపాదించినా పన్ను కట్టాల్సిన అవసరం లేదు!
27 November 2024, 12:41 IST
- Tax Free State : భారత్‌లో నివసించేవారు పన్ను కడుతుంటారు. ఇందుకోసం కొన్ని రకాల శ్లాబులు కూడా ఉంటాయి. కానీ మన దేశంలోని ఓ రాష్టంలోని ప్రజలు ట్యాక్స్ పే చేయరు. ఎందుకో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
దాదాపు అన్ని దేశాల్లో ఆదాయపు పన్ను చెల్లించడం తప్పనిసరి విధానం. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వం తన బడ్జెట్‌తో సహా అనేక ప్రాజెక్టులను ప్రకటిస్తుంది. దేశంలోని ప్రతి పౌరుడు ఒక్కో విధంగా పన్నులు చెల్లిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం ఆదాయపు పన్ను ఉంటుంది. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను విధానం అమలులో ఉంది. వివిధ రకాల శ్లాబులు కూడా ఉంటాయి. కానీ ఒక రాష్ట్రంలో మాత్రం ఈ పన్ను చెల్లించరు.
భారతదేశంలో సిక్కిం మినహా అన్ని రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను విధానం అమల్లో ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(ఎఫ్) ప్రకారం సిక్కిం ప్రజలకు ఆదాయపు పన్ను చెల్లింపు నుండి మినహాయింపు ఉఉంది. 1975లో సిక్కిం 22వ రాష్ట్రంగా భారతదేశంలో విలీనమైంది. ఆ సమయంలోనే ఈ ప్రత్యేక హక్కును ఏర్పాటు చేశారు.
1975లో భారత్‌లో విలీనమైన సమయంలో ఆ రాష్ట్రానికి పన్ను మినహాయింపు ఉంది. అప్పటి రాజు విలీనం సమయంలో షరతు పెట్టారు. 1975 కంటే ముందు పన్ను చెల్లింపుల్లో తాము ఎలాంటి చట్టాలు, నిబంధనలు పాటిస్తున్నామో విలీనం తర్వాత కూడా అవే ఉండాలని సూచించారు. అందుకే 1948 నుంచి సిక్కిం తన సొంత పన్ను చట్టాన్ని అనుసరిస్తోంది. ప్రస్తుతం అప్పట్లో నుంచి ఉన్న పన్ను మినహాయింపు ఇప్పటికీ కొనసాగుతోంది.
సిక్కిం రాష్ట్రం పన్ను రహిత స్థితికి ఆర్టికల్ 371(f), ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(26AAA)లో ఉంది. ఈ నిబంధన ప్రకారం సిక్కిం మేటర్స్ రెగ్యులేషన్ 1961 ప్రకారం సిక్కిం నివాసులుగా గుర్తించిన వ్యక్తులకు సెక్యూరిటీలు, డివిడెండ్‌లపై వడ్డీ వంటి మూలాధారాలతో సహా ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంది.
భారత్‌లోని పౌరులు నిర్దిష్ట పరిమితుల కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉంటే వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలి. కానీ సిక్కిం నివాసితులు ఈ ఆర్థిక బాధ్యతల నుండి మినహాయింపు ఉంటుంది. వారి ఆదాయం ఎంత ఎక్కువగా ఉన్నా.. కోట్లలో ఉన్నా.. మినహాయింపు దొరుకుతుంది. దీంతో స్వేచ్ఛగా పొదుపు, పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఉంటుంది.
ఆదాయపు పన్ను చెల్లింపు నుండి మినహాయింపు ఉన్న సిక్కిం ప్రజలు ప్రస్తుతం మిగులు డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. చాలా మంది పర్యాటకానికి, హోటళ్ళు, రిసార్ట్‌లతో సహా వివిధ ఆర్థిక కార్యకలాపాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2008లో కేంద్రం సిక్కింలో ఉన్న ఇన్‌కంటాక్స్ యాక్ట్‌ను రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్టికల్ 371(f) తెచ్చింది. కొత్తగా సెక్షన్ 10(26AAA) తీసుకొచ్చింది. దీని ద్వారా కూడా 94 శాతం ప్రజలు పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంది.