Bithday return gifts: పుట్టిన రోజుకు ఈ బెస్ట్ రిటర్న్‌గిఫ్ట్స్ ఇవ్వొచ్చు.. ధర 50 నుంచి 100 లోపే
Bithday return gifts: మీ పిల్లల పుట్టినరోజుకు ఎలాంటి రిటర్న్ గిఫ్టులు ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఆప్షన్స్ మీకోసమే.
చిన్న పిల్లల పుట్టిన రోజంటే ఇంటిళ్లిపాదికీ ప్రత్యేకమే. ఆరోజున ప్రత్యేక వేడుకలు చేస్తాం. అయితే బర్త్‌డే పార్టీకి వచ్చిన పిల్లలకు ఇదివరకైతే కేకు, చాకోలేట్లు ఇచ్చి పంపిచేవాళ్లు. ఇప్పుడలా కాదు.. తప్పకుండా రిటర్న్ గిఫ్టులు ఇవ్వాల్సిందే. అయితే ఎలాంటి గిఫ్టులిస్తే బాగుంటుందని చాలా ఆలోచిస్తాం. మీరు కూడా అదే ఆలోచనతో ఉంటే తక్కువ బడ్జెట్‌లో, అటూ ఇటూగా వంద రూపాయల్లో వచ్చే రిటర్న్ గిఫ్టు ఐడియాలేంటో చూసేయండి.
1. మ్యాజిక్ వాటర్ డ్రాయింగ్ బుక్:
మరీ తక్కువ వయసున్న పిల్లలకు పెయింట్ ఇస్తే చేతులకు పూసుకుని, కింద పడేసి చిందరవందర చేసేస్తారు. బదులుగా ఈ మ్యాజిక్ వాటర్ డ్రాయింగ్ బుక్ బాగుంటుంది. ఈ బుక్ తో వచ్చే పెన్నులో నీళ్లు నింపి బుక్ మీద గీస్తే రంగుల బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు మంచి కాలక్షేపం అవుతుంది. మంచి గిఫ్ట్ ఇచ్చినట్లుంటుంది.
2. ఇన్‌ఫినైట్ పెన్సిల్:
పెన్సిల్ కొచ్చదనం పోయినప్పుడల్లా షార్పెనర్ వాడాల్సిందే. బదులుగా ఈ ఇన్‌ఫినైట్ పెన్సిల్ ఇస్తే మంచి బహుమతి అవుతుంది. దీంట్లో ఉన్న ప్రత్యేక గుణం వల్ల ఎంత రాసినా పదును తగ్గదు. దీంట్లో రిఫిల్ చేసుకోడానికి నిబ్స్, ఎరేజర్ కూడా ఉంటాయి. ధర కూడా 20 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వివిధ నాణ్యతలతో దొరుకుతుంది.
3. డిజైనర్ స్టేషనరీ:
పీజ్జా, బర్గర్ లాగా ఉండే పెన్నులు, లిప్ స్టిక్ లాగా ఉండే ఎరేజర్లు, బార్బీ థీమ్ తో ఉండే స్కేళ్లు, పెన్సిళ్లు, 3 ఇన్ 1 ఎరేజర్లు, మంచి ఆకారాల్లో ఉండే ఎరేజర్లు, షార్పెనర్లు,యునికార్న్ థీమ్ డైరీలు.. ఇలా ఒక్కటని కాదు. ఎలాగంటే అలాగా స్టేషనరీ వస్తువులు దొరకుతున్నాయి. ఇవన్నీ వంద రూపాయల లోపు.. చెప్పాలంటే 50 రూపాయల దగ్గర్లోనే వచ్చేస్తాయి. వీటిలో కొన్ని వస్తువులు కలిపి, పేపర్ బ్యాగ్ లో వేసి మంచి రిటర్న్ గిఫ్టులాగా ఇవ్వొచ్చు.
4. పెన్సిల్ గ్రిప్పర్స్:
చిన్న పిల్లలకు చేతి వ్రాత అందంగా రావడానికి సమయం పడుతుంది. కొందరు పిల్లలకు పెన్సిల్ పట్టుకోవడంలోనే సమస్య మొదలవుతుంది. పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేరు. గ్రిప్ సరిగ్గా లేక అక్షరాలు సరిగ్గా రాయలేరు. అలాంటప్పుడు ఈ పెన్సిల్ గ్రిప్ వాడొచ్చు. దీనివల్ల చేతి రాత క్రమంగా మెరుగుపడుతుంది. ఇది సిలికాన్ మెటీరియల్ తొ తయారు చేస్తారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు దీన్ని సులభంగా వాడొచ్చు. రిటర్న్ గిఫ్ట్ కోసం పెన్సిళ్లు, పెన్నులతో పాటూ ఈ గ్రిప్ కూడా ఇస్తే సరి.
5. ఫంకీ జ్యువెలరీ:
కాస్త ఓపిక ఉంటే మీరే బజారుకు వెళ్లి నాలుగైదు రకాల యాక్సెసరీలు కొనండి. ఫంకీగా, చిన్నపిల్లలకు నచ్చేలా చిన్న క్లిప్పులు, రబ్బర్ బ్యండ్లు, ఫంకీ నెక్‌లేస్, హెయిర్ బ్యాండ్.. ఇవన్నీ మీకు నచ్చిన థీమ్‌తో కొని బ్యాగులో ప్యాక్ చేసి ఇవ్వండి. అన్నీ కలిపి వంద రూపాయల లోపే వచ్చేస్తాయి. పిల్లలకు నచ్చేలా మంచి రంగుల్లోవి, కార్టూన్స్ థీమ్ ఉన్నవి ఎంచుకుంటే చాలు.
టాపిక్