TCS Q4 result: క్యూ4 లో టీసీఎస్ నికర లాభాలు రూ. 12,434 కోట్లు
12 April 2024, 20:52 IST
TCS Q4 result: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టీసీఎస్ ఏప్రిల్ 12వ తేదీన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. క్యూ 4 లో టీసీఎస్ రూ. 12,434 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. క్యూ 3 తో పోలిస్తే సంస్థ నికర లాభాలు 4% పెరిగాయి.
టీసీఎస్ క్యూ 4 రిజల్ట్స్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్చి త్రైమాసికం (Q4) ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీన ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY24) లో కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన దాదాపు ఫ్లాట్ గా ఉంది. అలాగే, మార్కెట్ అంచనాలకు అనుగుణంగా సంస్థ లాభం 4 శాతం పెరిగింది.
ఆదాయం రూ.61,237 కోట్లు
అంతర్జాతీయంగా అనిశ్చితి కొనసాగినప్పటికీ.. క్యూ4ఎఫ్ వై24 (Q4FY24) లో అత్యధిక ఆర్డర్ బుక్ ను టీసీఎస్ సాధించడం విశేషం. క్యూ4 తో ఈ 2024 ఆర్థిక సంవత్సరాన్ని అత్యధిక ఆర్డర్ బుక్, 26 శాతం ఆపరేటింగ్ మార్జిన్ తో ముగించడం మాకు చాలా సంతోషంగా ఉందని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె కృతివాసన్ అన్నారు. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY24) లో కార్యకలాపాల ద్వారా టీసీఎస్ రూ.61,237 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ఏడాది ప్రాతిపదికన 3.5 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 1.1 శాతం (క్యూఓక్యూ) పెరిగింది. స్థిర కరెన్సీ (CC) పరంగా ఆదాయం 2.2 శాతం పెరిగింది.
రూ. 28 డివిడెండ్
క్యూ 4 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ (Dividend) ను కూడా టీసీఎస్ ప్రకటించింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.28 తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. మార్చి 31, 2024 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,01,546గా ఉందని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ తెలిపింది. వీరిలో 35.6 శాతం మంది మహిళలు ఉన్నారని వెల్లడించింది. గత పన్నెండు నెలలుగా ఐటీ సేవల అట్రిషన్ 12.5 శాతంగా ఉందని టీసీఎస్ తెలిపింది.