TCS Q3 result: టీసీఎస్ క్యూ 3 రిజల్ట్స్; 4 శాతం పెరిగిన ఆదాయం; భారీగా డివిడెండ్ కూడా..
TCS Q3 result: ఈ ఆర్థిక సంవత్సరం (Q3FY24) మూడో త్రైమాసికంలో (Q3FY24) ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ ఆదాయం గత సంవత్సరం క్యూ 3 తో పోలిస్తే, 4 శాతం పెరిగింది.
TCS Q3 result: టీసీఎస్ క్యూ3 ఫలితాలు వెలువడ్డాయి. ఆదాయంలో ఆశించిన పురోగతి కనిపించలేదు. టీసీఎస్ 2024 ఆర్థిక సంవత్సరం క్యూ 3 లో, గత సంవత్సరం క్యూ 3 తో పోలిస్తే, 4 శాతం ఆదాయ వృద్ధిని, 2 శాతం లాభాల వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 50 బేసిస్ పాయింట్లు పెరిగి 25 శాతానికి చేరుకుంది.
క్యూ 3 లో రూ. 11,058 కోట్ల లాభాలు
దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3 ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఈ క్యూ3లో కంపెనీ నికర లాభాలు రూ. 11,058 కోట్లు గా నమోదయ్యాయి. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 2.4% తక్కువ. గత త్రైమాసికంలో (Q2 FY24) టీసీఎస్ రూ. 11,380 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అదే విధంగా గత ఏడాది మూడో త్రైమాసికం (Q3 FY23) లో టీసీఎస్ రూ.10,883 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
రూ. 60,583 కోట్ల ఆదాయం
అలాగే, ఈ క్యూ 3 లో టీసీఎస్ మొత్తం ఆదాయం రూ. 60,583 కోట్లకు చేరింది. ఇది గత క్యూ 3 తో పోలిస్తే 4% అధికం. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ 2 తో పోలిస్తే, 1.5% అధికం. ఈ క్యూ లో టీసీఎస్ రూ.59,692 కోట్ల ఆదాయం సముపార్జించింది.
డివిడెండ్
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలతో పాటు ఇన్వెస్టర్లకు డివిడెండ్ ను కూడా టీసీఎస్ (TCS) ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.27 చొప్పున డివిడెండ్ ను, రూ.18 చొప్పున ప్రత్యేక డివిడెండ్ ను కంపెనీ ప్రకటించింది. దీని కోసం రికార్డ్ తేదీ జనవరి 19, 2024 కాగా చెల్లింపు తేదీ ఫిబ్రవరి 5, 2024. గత సంవత్సరం డిసెంబర్ 31 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,03,305 గా ఉంది. ఇందులో 35.7 శాతం మంది మహిళలున్నారు.