TCS stopped pay: టీసీఎస్ లో వేతనాల నిలిపివేత.. బలవంతపు బదిలీలు; ఆందోళనలో ఉద్యోగులు
TCS stopped pay: ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సుమారు 900 మంది ఉద్యోగుల వేతనాలను నిలిపివేసినట్లు సమాచారం. అంతేకాదు, దాదాపు 2 వేల మంది ఉద్యోగులను బలవంతంగా ట్రాన్స్ ఫర్ చేసినట్లు కూడా టీసీఎస్ ఆరోపణలు ఎదుర్కొంటోంది.
TCS stopped pay: సరైన నోటీసు ఇవ్వకుండా వందలాది మంది ఉద్యోగులను బలవంతంగా బదిలీ చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు మహారాష్ట్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసులు పంపింది.
బలవంతపు బదిలీలు..
ఈ బదిలీలకు సంబంధించి ఐటీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే ‘‘నెసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES)’’ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. టీసీఎస్ లోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 2000 మంది ఉద్యోగులను వివిధ నగరాలకు బదిలీ చేసిందని ఫిర్యాదులో ఆ పేర్కొన్నారు.
బెదిరింపులు కూడా..
ముంబైలోని టీసీఎస్ (TCS) ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులను సరైన సమాచారం, నోటీస్ పీరియడ్, ముందస్తు అనుమతి లేకుండా వేరే నగరాల్లోని వివిధ బ్రాంచ్ లకు బదిలీ చేశారని, దీనివల్ల వారు ఇబ్బందులకు గురయ్యారని ఎన్ఐటిఇఎస్ తన ఫిర్యాదులో తెలిపింది. బదిలీ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని టీసీఎస్ ఉద్యోగులను బెదిరించిందని ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్ ప్రీత్ సింగ్ సలూజా మహారాష్ట్ర కార్మిక శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బలవంతపు బదిలీ తర్వాత టీసీఎస్ ఉద్యోగుల నుంచి తమకు 300 కు పైగా ఫిర్యాదులు వచ్చాయని యూనియన్ తెలిపింది.
వేతనం నిలిపివేత
బదిలీ ఉత్తర్వులను ఉల్లంఘించి, కొత్త బ్రాంచ్ లో రిపోర్ట్ చేయని ఉద్యోగుల వేతనాలను నిలిపివేస్తామని టీసీఎస్ హెచ్చరించింది. అంతేకాదు, బదిలీ చేసినా.. కొత్త బ్రాంచ్ లో చేరని దాదాపు 900 మంది ఉద్యోగులకు వేతనాలను నిలిపివేసింది. ప్రస్తుతం పని చేస్తున్న కార్యాలయం నుంచి రిలీవ్ అయిన తరువాత.. ట్రాన్స్ ఫర్ చేసిన బ్రాంచ్ లో రిపోర్ట్ చేయడానికి 14 రోజుల గడువు మాత్రమే ఇస్తున్నట్లు టీసీఎస్ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో స్పష్టం చేసింది.