TCS recruitment: ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా 40 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వనున్న టీసీఎస్
TCS recruitment: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services TCS) క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 40 వేల మంది విద్యార్థులను హైర్ చేసుకోవాలని నిర్ణయించింది.
TCS recruitment: టీసీఎస్ (TCS) సాఫ్ట్ వేర్ సంస్థ ఈ సంవత్సరం మొత్తం 40 వేల ఉద్యోగాలను క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఒకవైపు, మరో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys).. ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్ లను నిర్వహించడం లేదని ప్రకటించింది. ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లేవని ఇన్ఫోసిస్ ప్రకటించిన నేపథ్యంలో.. భారీ స్థాయిలో మొత్తం 40 వేల మంది విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు టీసీఎస్ ప్రకటించడం విశేషం.
ప్రతీ సంవత్సరం లాగానే..
సాధారణంగా తాము ప్రతీ సంవత్సరం 35 వేల నుంచి 40 వేల మంది విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా వివిధ ప్రాజెక్టుల్లో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, అదే విధంగా ఈ సంవత్సరం కూడా 40 వేల మంది విద్యార్థులను కంపెనీలోకి తీసుకుంటున్నామని టీసీఎస్ సీఓఓ ఎన్ గణపతి సుబ్రమణ్యన్ వెల్లడించారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున లే ఆఫ్స్ కూడా ఉండబోవని శుభవార్త తెలిపారు. అంతేకాదు, వేరే కంపెనీల్లో వివిధ హోదాల్లో ఉన్నవారిని కూడా లేటరల్ ఎంట్రీ ద్వారా హైర్ చేసుకుంటామని, తద్వారా తమ కంపెనీలో టాలెంట్ పూల్ ను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. అయితే, వారి సంఖ్య పెద్దగా ఉండబోదని, అవసరం ప్రాతిపదికగా వారిని రిక్రూట్ చేసుకుంటామని వివరించారు. 2022 జులై నాటికి టీసీఎస్ లోని వివిధ విభాగాల్లో దాదాపు 5,56,000 మంది ఉద్యోగులున్నారు. వారిలో సుమారు 150 కి పైగా దేశాల వారు ఉండడం విశేషం.