తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలతో సోమవారం స్టాక్ మార్కెట్‌ మీద దెబ్బ పడుతుందా?

Stock Market : సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలతో సోమవారం స్టాక్ మార్కెట్‌ మీద దెబ్బ పడుతుందా?

Anand Sai HT Telugu

11 August 2024, 19:51 IST

google News
    • Stock Market : సెబీ చీఫ్​ మాధవి పురి బచ్​, ఆమె భర్త ధవల్​ బచ్​లపై హిండెన్​బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్​ ఆఫ్​షోర్​ ఫండ్స్​తో వారికి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం స్టాక్ మార్కెట్‌‌పై ఏదైనా ప్రభావం చూపిస్తుందా? అనే ప్రశ్న చాలా మందికి ఉంది.
స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్

సెబీ చీఫ్ మాధవి పురి బచ్​, ఆమె భర్త ధవల్​ బచ్​‌పై హిండెన్​బర్గ్ తాజా ఆరోపణల నేపథ్యంలో సోమవారం మార్కెట్ కుదుపునకు లోనయ్యే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కిందటి ఏడాది ఇదే హిండెన్‌బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదిక దెబ్బకు అదానీ షేర్లు పడిపోయాయి. కోట్లలో నష్టం వచ్చింది. అందుకే ఈ విషయాన్ని ఈజీగా తీసుకోకూడదని కొంతమంది నిపుణుల అభిప్రాయం.

గత వారం రోజులుగా అస్థిరతను చూశాయి స్టాక్ మార్కెట్లు. అయితే తాజాగా మాధవి పురి బచ్​, ఆమె భర్త ధవల్​ బచ్​లపై హిండెన్​బర్గ్ చేసిన తాజా ఆరోపణలతో గతంలో జరిగినట్టుగా మార్కెట్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం ట్రేడింగ్‌లో కొంత బలహీనతను తోసిపుచ్చలేమని అంటున్నారు. మదుపరులు, ట్రేడర్లు అస్థిరతకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం సోమవారం ట్రేడింగ్ ప్రారంభ దశల్లో కొంత బలహీనత ఉండవచ్చని మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా అన్నారు. ఆ తర్వాత మద్దతుగా మార్కెట్లోకి కొత్త కొనుగోళ్లు తక్కువ స్థాయిలో వస్తాయో లేదో గమనించాల్సి ఉంటుందని అన్నారు.

నిజానికి హిండెన్‌బర్గ్ ఆరోపణలు మార్కెట్లు మూతపడిన వారాంతంలో రావాల్సి ఉందని ఒక దేశీయ బ్రోకరేజీ సంస్థ రిటైల్ రీసెర్చ్ హెడ్ తెలిపారు. అయితే శనివారం రాత్రి ఈ విషయాలు బయటకు వస్తే సోమవారం మార్కెట్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని హిండెన్‌బర్గ్ అనుకుని ఉంటుందని ఆయన చెప్పారు. ఎందుకంటే ఇన్వెస్టర్ల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం చాలావరకు ఒక రోజు కంటే ఎక్కువ ఉండదని తెలిపారు. ఆదివారం ఈ వివాదంపై చర్చ ఎక్కువగా నడవడంతో సోమవారం ఉదయం మార్కెట్‌పై కచ్చితంగా కొంత ప్రభావం ఉంటుందని అన్నారు. ఉదయం తర్వాత కాసేపటికి మార్కెట్‌లు పుంజుకునే ఛాన్స్ ఉంటుందన్నారు.

మరోవైపు ఈ విషయంపై సెబీ చీఫ్ స్పందించారు. 'ఆగస్టు 10, 2024 నాటి హిండెన్‌బర్గ్ నివేదికలో మాపై చేసిన ఆరోపణలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.' అని మాధవి పురి బచ్ ఒక ప్రకటనలో తెలిపారు. పలువురు నిపుణులు, పరిశ్రమ అనుభవజ్ఞులు కూడా సెబీ చీఫ్‌కు మద్దతుగా నిలిచారని, హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని అంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ వో మోహన్ దాస్ పాయ్ బహిరంగంగానే బుచ్‌కు మద్దతు తెలిపి హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్లు చిన్న జెర్క్ తర్వాత స్థిరపడవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

గమనిక : పైన చేసిన అభిప్రాయాలు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులతో మాట్లాడండి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది.

తదుపరి వ్యాసం