Hindenburg tweet : హిండెన్​బర్గ్​ 4 పదాల ట్వీట్​- ఇన్​వెస్టర్స్​లో గుబులు- స్టాక్​ మార్కెట్​లపై మరో పిడుగు?-something big soon india hindenburg research cryptically teases on x ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hindenburg Tweet : హిండెన్​బర్గ్​ 4 పదాల ట్వీట్​- ఇన్​వెస్టర్స్​లో గుబులు- స్టాక్​ మార్కెట్​లపై మరో పిడుగు?

Hindenburg tweet : హిండెన్​బర్గ్​ 4 పదాల ట్వీట్​- ఇన్​వెస్టర్స్​లో గుబులు- స్టాక్​ మార్కెట్​లపై మరో పిడుగు?

Sharath Chitturi HT Telugu
Aug 10, 2024 12:49 PM IST

HIndenburg twitter : సంచలనాలకు కేరాఫ్​ అడ్రెస్​గా నిలిచే హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ మరోమారు భారత స్టాక్​ మార్కెట్​లను టార్గెట్​ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు హిండెన్​బర్గ్​ చేసిన ఓ ట్వీట్​ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

 భారత్​పై మరో పిడుగు తప్పదా?
భారత్​పై మరో పిడుగు తప్పదా?

భారత స్టాక్​ మార్కెట్​లకు హిండెన్​బర్గ్​ పేరు ఒక పీడకల లాంటింది. అదానీ గ్రూప్​పై సంచలన నివేదికను బయపెట్టి, దేశీయ స్టాక్​ మార్కెట్​లు కుప్పకూలడానికి ఈ సంస్థ కారణం. అయితే అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్​బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు భారత్​పై మరో బాంబ్​ వేసేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు సంస్థ తాజాగా ఎక్స్​లో చేసిన ఓ క్రిప్టిక్​ ట్వీట్​​ వైరల్​గా మారింది.

'సమ్​థింగ్ బిగ్ సూన్ ఇండియా (త్వరలో భారీ విషయం జరగబోతోంది),' అని హిండెన్​బర్గ్ రీసెర్చ్ ఎక్స్​లో పోస్ట్​ చేసింది. ఇప్పుడు ఏం చేయబోతోందో? ఎవరి మీద పిడుగు పడబోతోందో? అని ఆందోళనలు మొదలయ్యాయి.

హిండెన్​బర్గ్ రీసెర్చ్ అంటే ఎవరు?

హిండెన్​బర్గ్ రీసెర్చ్ ఎల్​ఎల్​సి అనేది అమెరికాకు చెందిన పెట్టుబడి పరిశోధన, షార్ట్ సెల్లింగ్ సంస్థ. ఇది కంపెనీ స్టాక్స్​లో ఎంట్రీ తీసుకున్న అనంతరం కంపెనీల్లో మోసాలు లేదా అవినీతిని బహిర్గతం చేస్తూ నివేదికలను ప్రచురిస్తుంది. స్టాక్స్​ పతనమైన తర్వాత షార్ట్​ సెల్లింగ్​ ద్వారా లాభపడుతుంది.

2017లో నేథన్​ ఆండర్సన్​ అనే వ్యక్తి ఈ సంస్థను స్థాపించారు. ఇందులో కేవలం 10 మంది ఉద్యోగులే ఉంటారని సమాచారం. కానీ వీరు చాలా రీసెర్చ్​ చేసి, కంపెనీల అవినీతిని బయటపెడతారని అభిప్రాయాలు ఉన్నాయి.

షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి?

షార్ట్ సెల్లింగ్ అనేది స్టాక్​ మార్కెట్​లో సహజమైన ప్రక్రియ. ఏదైనా కంపెనీ స్టాక్​ స్వల్ప కాలంలో పడుతుందని ముందుగానే అంచనా వేసి, వాటిని విక్రయించడం షార్ట్​ సెల్లింగ్​. షేర్లు పడిన తర్వాత వచ్చే లాభాలను తీసుకుని, కొనుగోలు చేసి, షార్ట్​ సెల్లింగ్​ పొజిషన్స్​ని క్లోజ్​ చేస్తారు.

గతేడాది అదానీ గ్రూప్​పై సంచలన నివేదికను బయటపెట్టింది హిండెన్​బర్గ్​ రీసెర్చ్​. సంస్థలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఆ సమయంలో అదానీ స్టాక్స్​తో పాటు మొత్తం దేశీయ స్టాక్​ మార్కెట్​లు తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. కానీ తాము ఎలాంటి తప్పు చేయలేదని అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ చెప్పుకొచ్చారు. స్టాక్స్​ నిదానంగా మళ్లీ పూర్వ స్థితికి చేరుకున్నాయి. అంతేకాదు, చాలా రెట్లు పెరిగాయి కూడా!

ఇప్పుడు హిండెన్​బర్గ్​ చేసిన ట్వీట్​ మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏ కంపెనీని ఆ సంస్థ టార్గెట్​ చేస్తుందో అని భయాలు మొదలయ్యాయి. అదే సమయంలో, హిండెన్​బర్గ్​ ఏం చేసినా, భారత స్టాక్​ మార్కెట్​లను కూల్చలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ తన విశ్వసనీయతను కోల్పోయిందని అంటున్నారు.

“భారత మార్కెట్​ని హిండెన్​బర్గ్​ మళ్లీ షార్ట్​ చేస్తోంది. కానీ ఆ సంస్థకు ఒక విషయం అర్థం కావడం లేదు. 2023 జనవరిలో తన చివరి నివేదిక బయటపెట్టినప్పుడు మార్కెట్లు పడ్డాయన్నది నిజమే కానీ. ఆ తర్వాత వెంటనే రికవర్​ అయ్యాయి. సెన్సెక్స్​ ఏకంగా 20వేల పాయింట్లు పెరిగింది. ఇన్​వెస్టర్లు హిండెన్​బర్గ్​కి భయపడాల్సిన పని లేదు,” అని ఓ నెటిజన్​ అభిప్రాయపడ్డాడు.

“ఈసారి నిఫ్టీ 30,000 మార్క్​ని టచ్​ చేస్తుంది,” అని మరొకరు రాసుకొచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం