తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ipo News: జీఎంపీ చూసి ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా?.. నిపుణులు ఏమంటున్నారు?

IPO news: జీఎంపీ చూసి ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా?.. నిపుణులు ఏమంటున్నారు?

Sudarshan V HT Telugu

24 September 2024, 16:01 IST

  • వరుస ఐపీఓలు స్టాక్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. వాటిలో మెజారిటీ ఐపీఓలు ఇష్యూ ప్రైస్ కన్నా ఎక్కువ ధరకు లిస్ట్ అవుతూ, ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తున్నాయి. సాధారణంగా ఇన్వెస్టర్లు ఐపీఓల్లో పెట్టుబడి పెట్టేముందు ఆ ఐపీఓ జీఎంపీని పరిశీలిస్తారు. జీఎంపీని చూసి ఐపీఓకు అప్లై చేయడం సరైనదేనా?

జీఎంపీ చూసి ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా?
జీఎంపీ చూసి ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా?

జీఎంపీ చూసి ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా?

గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) అనేది భారతదేశంలోని ఐపీఓ ఇన్వెస్టర్లు ప్రధానంగా గమనించే విషయం. కానీ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ నీలేష్ షా మాత్రం ఐపీఓల జీఎంపీని గుడ్డిగా నమ్మడం సరికాదని చెబుతున్నారు. జీఎంపీలను విశ్వసించి, ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. జీఎంపీ ధర కన్నా తక్కువకు ఐపీఓ లిస్టింగ్ ధర ఉండడం చాలా సందర్భాల్లో జరుగుతుందన్నారు.

స్టాక్ మార్కెట్ పరిధిలోనే గ్రే మార్కెట్

‘‘గ్రే మార్కెట్ ప్రీమియం ఆధారంగా చాలామంది ఐపీఓలకు సబ్ స్క్రైబ్ చేస్తారు. అసలు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంను ఐపీవోను ప్రభావితం చేయడానికి ఎందుకు అనుమతించాలి? ఇన్వెస్టర్లను ప్రభావితం చేయడానికి మీరు నిజంగా గ్రే మార్కెట్ ప్రీమియంను కోరుకుంటే, అప్పుడు స్టాక్ మార్కెట్ల (stock market) ఆధ్వర్యంలోనే ఒక గ్రే మార్కెట్ తరహా మార్కెట్ ను ఎందుకు ఏర్పాటు చేయకూడదు?’’ అని షా ప్రశ్నించారు. అలా చేస్తే, అది నిబంధనల పరిధిలో ఉంటుందని, అన్ని కార్యకలాపాలు మార్కెట్ చట్రంలోనే జరుగుతాయని, ఇన్వెస్టర్ డబ్బుకు హామీ ఉంటుందని వివరించారు.

జీఎంపీలను తారుమారు చేయవచ్చా?

జీఎంపీలను తారుమారు చేయవచ్చా అన్న ప్రశ్నకు. ‘‘గ్రే మార్కెట్ లో వాల్యూమ్ లు ఎలా పెరుగుతాయో? గ్రే మార్కెట్ ప్లేయర్లు ఎవరో ఎవరికీ తెలియదు. టెలీగ్రాం, వాట్సప్ ల్లో ఏ నంబర్ నుంచైనా మెసేజ్ రావచ్చు. ప్రజలు చాలా అమాయకులు. వారు ఆ సంఖ్యలను నమ్ముతారు. ఇప్పుడు ఇది వాస్తవ ఫలితాలపై కాకుండా ఎగ్జిట్ పోల్స్ పై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంటిది. ఆ తప్పు చేయకండి’’ అని కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ నీలేష్ షా సూచించారు.

ఈక్విటీల్లో ఏం జరుగుతుంది?

జీఎంపీని ఎందుకు విశ్వసించకూడదో షా వివరిస్తూ.. ‘‘ఈక్విటీలలో, ఉదాహరణకు, స్విగ్గీ (swiggy) ఐపీఓ బయటకు వస్తే, లిస్టింగ్ కు ముందు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ (trading) ప్రారంభమవుతుంది. మార్జిన్లను ఉపయోగించి ట్రేడింగ్ జరుగుతుంది. తదనుగుణంగా సెటిల్మెంట్ జరుగుతుంది. గ్రే మార్కెట్ లో మీరు ధర చూడవచ్చు కాని సెటిల్ మెంట్ కు హామీ ఇవ్వడానికి ఎవరు ఉన్నారు? ఎన్ని సెటిల్మెంట్లు చేశారో ఎవరికి తెలుసు? అండర్ గ్రౌండ్ లో ఆడుకునే బదులు దాన్ని రెగ్యులరైజ్ చేయడం మంచిది కదా. ఈ గ్రే మార్కెట్ ను వైట్ లోకి మారుద్దాం’’ అన్నారు. చాలాసార్లు గ్రే మార్కెట్ ఆధారంగా ఐపీఓ సబ్ స్క్రిప్షన్ జరుగుతుందని, ఇది సమంజసం కాదని ఆయన వివరించారు.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్