Bengaluru news: బెంగళూరులో 18 కిమీల అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు; ట్రాఫిక్ చిక్కులకు ఇక చెక్!-karnataka cabinet okays bengalurus mega tunnel project for rs 12 690 cr report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru News: బెంగళూరులో 18 కిమీల అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు; ట్రాఫిక్ చిక్కులకు ఇక చెక్!

Bengaluru news: బెంగళూరులో 18 కిమీల అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు; ట్రాఫిక్ చిక్కులకు ఇక చెక్!

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 09:57 PM IST

బెంగళూరు ట్రాఫిక్ రద్దీ సమస్యలను పరిష్కరించడానికి రూ. 12,690 కోట్ల వ్యయంతో నిర్మించే భూగర్భ మెగా టన్నెల్ రోడ్ నెట్ వర్క్ ప్రాజెక్టుకు కర్నాటక కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ తో పాటు రూ. 500 కోట్లతో నిర్మించే స్కైడెక్ నిర్మాణానికి కూడా కర్నాటక కేబినెట్ ఆమోదం తెలిపింది.

బెంగళూరులో 18 కిమీల అండర్ గ్రౌండ్ టన్నెల్
బెంగళూరులో 18 కిమీల అండర్ గ్రౌండ్ టన్నెల్

ఇటీవలి కాలంలో ట్రాఫిక్ సమస్యలకు బెంగళూరు కేరాఫ్ గా మారింది. ట్రాఫిక్ జామ్ లతో బెంగళూరు నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి ఒక మెగా ప్రాజెక్టును కర్నాటక ప్రభుత్వం చేపట్టింది.

18 కిమీల అండర్ గ్రౌండ్ టన్నెల్

బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఉద్దేశించిన రెండు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కర్ణాటక మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. మొదటిది రూ.12,690 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా బెంగళూరులో హెబ్బాళ్ ఫ్లైఓవర్ నుండి సెంట్రల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ వరకు, 18 కిలోమీటర్ల మేర, భూగర్భంలో ట్విన్-ట్యూబ్ టన్నెల్ ను నిర్మిస్తారు. ఈ 18 కిమీల మార్గంలో ఐదు ఎంట్రీ, ఐదు ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు కర్నాటక ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. దీని నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు జారీ చేస్తామని రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ ధృవీకరించారు.

డీకే శివకుమార్ ప్రతిపాదన

ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు 7వ నెంబరు జాతీయ రహదారిని 14వ జాతీయ రహదారితో అనుసంధానం చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు రూపకల్పన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సంయుక్త భాగస్వామ్యంలో ఈ భూగర్భ టన్నెల్ నెట్ వర్క్ ను నిర్మిస్తారు. దీని నిర్మాణానికి రూ .30,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. త్వరలో టర్ఫ్ క్లబ్, గోల్ఫ్ కోర్స్, బెంగళూరు ప్యాలెస్ ప్రాంతాలలో భూ సేకరణ చేపడ్తామని, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

స్కై డెక్ నిర్మాణం

ఈ భూగర్భ టన్నెల్ తో పాటు రూ.500 కోట్లతో 250 మీటర్ల ఎత్తైన స్కై డెక్ ప్రాజెక్టుకు కూడా కర్నాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగళూరు (Bengaluru) లో అతిపెద్ద టూరిస్ట్ (tourism) ఆకర్షణగా ఈ స్కై డెక్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, రూ.686 కోట్ల వ్యయంతో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంప్రదాయ లైటింగ్ స్థానంలో వీటిని అమరిస్తే, ఏటా రూ.300 కోట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. అదనంగా కొత్తగా ఏర్పాటు చేసిన వార్డులకు సేవలందించేందుకు రూ.20 కోట్లతో 52 కొత్త ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు.