New Gen- Royal Enfield Bullet 350 । నూతన తరం బుల్లెట్ బైక్.. ప్రత్యేకతలు ఇవిగో!
18 October 2022, 21:23 IST
- New Gen- Royal Enfield Bullet 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ నూతన తరం బుల్లెట్ మోటార్‌సైకిల్‌ను త్వరలో ప్రవేశపెట్టనుంది. దీనిలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
New Gen- Royal Enfield Bullet 350
మోటార్‌సైకిల్ మార్కెట్లో రారాజుగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ 350సీసీ పోర్ట్‌ఫోలియోను రిఫ్రెష్ చేసే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే కొత్త ప్లాట్‌ఫారమ్ మీద J-సిరీస్ ఇంజిన్‌తో మెటోర్ 350, జెన్ క్లాసిక్ 350, హంటర్ 350 వంటి మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. ఇప్పుడు స్టాండర్డ్ బుల్లెట్ 350లో కొత్త తరం తీసుకు రాబోతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. "బుల్లెట్ మేరీ జాన్" నేపథ్యంతో ప్రచార టీజర్లు రూపొందుతున్నాయి.
ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్‌ల మాదిరిగా కాకుండా, కొత్త బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పురాతనమైన మోటార్‌సైకిల్ పేర్లలో 'బుల్లెట్' కూడా ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎన్ని మోడళ్లు వచ్చినా, బుల్లెట్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. 1931లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ పరిచయం అయింది. ఇప్పటివరకూ తరాలను చూసింది. ఈ మోడల్‌కు దేశంలో అమితమైన అభిమానం ఉంది, అభిమానులకు బుల్లెట్ బైక్ అంటే ఒక భావోద్వేగం. ఈ నేపథ్యంలో నూతన తరం బుల్లెట్ కూడా అదే వారసత్వాన్ని కొనసాగించనుంది. మోటార్‌సైకిల్ రెట్రో డిజైన్ సజీవంగా ఉంచుతూ, దాని ఆత్మకు అంతరాయం కలిగించని విధంగా మార్పులు, చేర్పులు చేయనున్నట్లు సమాచారం. రాబోయే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్‌లో చాలా సూక్ష్మమైన రీతిలో అప్‌గ్రేడ్‌లను పొందుపరచనున్నారు. లాభాపేక్షతో సంబంధం లేకుండా మెరుగైన ప్రమాణాలతో ఈ బైక్ రూపొందిస్తున్నారు.
New Gen- Royal Enfield Bullet 350 బైక్‌లో ఎలాంటి అప్‌గ్రేడ్‌లు ఉంటాయి?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ అసలైన డిజైన్ అలాగే ఉంటుంది. అదే సింగిల్-పీస్ సీట్, రెట్రో-స్టైల్ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లు ఉంటాయి. రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ సీటింగ్ పొజిషన్ చాలా కమాండింగ్ గా, నిటారుగా కూర్చునే విధంగా ఉంటుంది. దీనిపే వారు నిటారుగా ఉండటం వలన ఠీవీగా, ఒక రాజసం కనిపించే విధంగా ఇలాంటి పొజిషనింగ్ చాలా కాలం నుంచి ఇస్తున్నారు.
అలాగే ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 తరహా స్విచ్ గేర్‌లు, క్లాసిక్ 350 తరహా మెరుగైన సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ హార్డ్‌వేర్ అందించనున్నారు. ఇకపై బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ఎలక్ట్రిక్ స్టార్టర్‌ను స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా కలిగి ఉండనుంది. సింగిల్-ఛానల్ ABS, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, గ్యాస్-ఛార్జ్డ్ రియర్ సస్పెన్షన్, బేసిక్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఇంజన్ విషయానికొస్తే, రాబోయే సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ J-సిరీస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లో ఉన్నట్లుగా అదే 349cc, సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్ట్ పెట్రోల్ ఇంజన్‌తో అందించనున్నారు. దీనిని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2బిహెచ్‌పి పవర్, 27ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. (Also Read: డుగ్గుడుగ్గు సౌండ్ లేని ఎలక్ట్రిక్ బుల్లెట్)
ఇప్పుడు ఉన్న కలర్ స్కీములతో పాటు కొన్ని కొత్తవి కలిపి మొత్తంగా 8 కలర్ ఆప్షన్లలో ఈ బైక్ రాబోతుంది. మరికొద్ది కాలంలోనే ఇది మార్కెట్లోకి లాంచ్ అవుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
టాపిక్