Reliance Jio data traffic: భారత్ లోని డేటా ట్రాఫిక్ లో 60% వాటా రిలయన్స్ జియోదే..
07 August 2024, 21:59 IST
Reliance Jio data traffic: 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం డేటా ట్రాఫిక్ లో రిలయన్స్ జియో వాటా 60 శాతానికి పెరిగిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదిక తెలిపింది. జియో ఈ మార్చి నెలలో నెలకు 28.7 జీబీ సగటు తలసరి డేటా వినియోగాన్ని నమోదు చేసింది.
భారత్ లోని డేటా ట్రాఫిక్ లో 60% వాటా రిలయన్స్ జియోదే
Reliance Jio data traffic: దేశంలో నమోదవుతున్న మొత్తం డేటా ట్రాఫిక్ లో రిలయన్స్ జియో వాటా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 60 శాతానికి పెరిగిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదిక తెలిపింది. భారత్ లో జియో అతిపెద్ద ప్రైవేట్ టెలికమ్యూనికేషన్ సంస్థ అన్న విషయం తెలిసిందే. నెక్స్ట్ జనరేషన్ నెట్ వర్క్ సేవలతో యూజర్ బేస్ ను, మార్కెట్ వాటాను మరింత పెంచుకుంటామని రిలయన్స్ (reliance) జియో చెబుతోంది. రాబోయే సంవత్సరాల్లో భారత టెలీకాం రంగంలో బలమైన ప్లేయర్ గా కొనసాగుతామని తెలిపింది.
డేటా డార్క్ ఇండియా నుంచి డేటా రిచ్ ఇండియాగా మార్చాం..
రిలయన్స్ జియో "డేటా డార్క్ ఇండియా"ను "డేటా రిచ్ ఇండియా" గా మార్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ అన్నారు. 4 జీ. 5 జీ నెట్ వర్క్ సేవలను రికార్డు సమయంలో దేశంలో అందుబాటులోకి తీసుకువచ్చామని కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. జియో నెక్స్ట్ జనరేషన్ ఫిక్స్ డ్ వైర్ లెస్ నెట్ వర్క్ లను అందుబాటులోకి తీసుకురావడంతో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి పరిమితమైన లాస్ట్ మైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవల వినియోగం ఎక్కువగా ఉంటుందని కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది.
సాంకేతిక పరిజ్ఞానంతో..
జియో తన సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో పెద్ద ఎత్తున అమలు చేస్తోందని, ఆ తర్వాత వాటిని ప్రపంచ దేశాలకు తీసుకెళ్తుందని నివేదిక తెలిపింది. వంద కోట్ల మంది భారతీయులకు ఇళ్లు, కార్యాలయాలు, ప్రయాణాల్లో వారి డిజిటల్ అవసరాలకు సరిపడా డేటా సామర్థ్యాన్ని జియో నిర్మించింది. భారతదేశంలో డేటా ట్రాఫిక్ లో జియో వాటా 60 శాతానికి పెరిగింది. ఇది భారతీయులు అత్యంత ఇష్టపడే బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ గా మారింది" అని రిలయన్స్ జియో తన వార్షిక నివేదికలో తెలిపింది.
నెలకు సగటు తలసరి డేటా 28.7 జీబీ
ఈ మార్చి నెలలో నెలకు 28.7 జీబీ సగటు తలసరి డేటా వినియోగాన్ని జియో నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 5 జీ వినియోగదారులు, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ల పెరుగుదలతో మొత్తం డేటా ట్రాఫిక్ లో సంవత్సరానికి 32 శాతం పెరిగి దాదాపు 149 ఎక్సా బైట్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. ఒక ఎక్సాబైట్ యూనిట్ ఒక బిలియన్ గిగాబైట్లు.
జియో టెలికాం మార్కెట్ లీడర్ షిప్
రిలయన్స్ యాజమాన్యంలోని టెలికాం దిగ్గజం ‘జియో’ మొబైల్, ఫిక్స్డ్-లైన్ కేటగిరీలలో భారతదేశ టెలికాం మార్కెట్లో 48.18 కోట్ల వినియోగదారుల బేస్ తో తొలి స్థానంలో ఉంది. ఇందులో 10.8 కోట్ల 5 జీ చందాదారులు, 1.2 కోట్ల ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ చందాదారులు ఉన్నారు. జియో (jio) ట్రూ 5జీ నెట్ వర్క్ ఇప్పుడు జియో మొబిలిటీ డేటా ట్రాఫిక్ లో దాదాపు 30 శాతం కలిగి ఉంది. భారతదేశంలో స్టాండలోన్ ఆర్కిటెక్చర్ లో 5జీ (5g technology)ని అందిస్తున్న ఏకైక ఆపరేటర్ జియో అని రిలయన్స్ నివేదికలో తెలిపింది.
2016లో జియో 4జీ ప్రారంభం
‘‘2016లో జియో 4జీని ప్రారంభించడంతో భారత్ లో డిజిటల్ ఇన్ క్లూజన్ ను సాకారం చేసేందుకు ముందుకు వచ్చాం. జియో డేటా డార్క్ ఇండియాను డేటా రిచ్ దేశంగా మార్చింది. ప్రతి భారతీయ ఇంటికి సరసమైన, హై-స్పీడ్ 4 జీ డేటాను అందించింది. ఈ సంవత్సరం, జియో తన ట్రూ 5 జీ నెట్ వర్క్ ను భారతదేశం అంతటా ప్రపంచ రికార్డు సమయంలో ప్రారంభించడం ద్వారా దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచింది’’ అని అంబానీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.