BharatGPT: ‘భారత్ జీపీటీ’.. ఇది మన సొంత చాట్ జీపీటీ..
28 December 2023, 15:35 IST
BharatGPT: కృత్రిమ మేథ ఆధారిత వ్యవస్థల్లో చాట్ జీపీటీ (BharatGPT) ఒక చరిత్ర సృష్టించింది. ఆ తరువాత చాలా ఏఐ ఆధారిత చాట్ బాట్ లు వచ్చాయి. ఆ క్రమంలోనే రిలయన్స్ జియో భారత్ జీపీటీ (BharatGPT) ని ఆవిష్కరిస్తోంది.
ఆకాశ్ అంబానీ, ముకేశ్ అంబానీ
BharatGPT: కృత్రిమ మేధ (AI) ఆధారిత వ్యవస్థల వైపు ప్రపంచం వడివడిగా వెళ్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద భారతీయ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఏఐ ఆధారిత వ్యవస్థలోకి అడుగుపెట్టింది. ఐఐటీ బాంబే (IIT-Bombay) తో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ‘భారత్ జీపీటీ (BharatGPT)’ ని అభివృద్ధి చేస్తోంది.
ఏమిటీ భారత్ జీపీటీ?
చాట్ జీపీటీ (ChatGPT) తరహాలో భారత్ జీపీటీ (BharatGPT) కూడా కృత్రిమ మేధ (artificial intelligence - AI) ఆధారిత సమాచార వ్యవస్థ. దీన్ని రిలయన్స్ జియో (Reliance Jio), ఐఐటీ బాంబే (IIT-Bombay) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఒక విస్తృత సమాచార వ్యవస్థను రూపొందించడం భారత్ జీపీటీ లక్ష్యం. ఈ వివరాలను రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. ఈ భారత్ జీపీటీని "జియో 2.0" అని కూడా పిలుస్తున్నారు. రిలయన్స్ జియో విస్తృత విజన్ లో భాగంగా దీన్ని రూపకల్పన చేశారు. ఉత్పత్తులు, సేవల ప్రతి అంశంలో కృత్రిమ మేధ ప్రవేశించబోతోందని ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు.
2014 నుంచి..
రిలయన్స్ తో ఐఐటీ బాంబే 2014 నుంచి వివిధ కార్యక్రమాల రూపకల్పనల్లో భాగస్వామిగా ఉంది. కృత్రిమ మేధ విస్తృత సామర్థ్యం సహకారంతో సృజనాత్మకత, వైవిధ్య పూరిత ఉత్పత్తులు, సేవలను అందించడం లక్ష్యంగా ఈ రెండు కలిసి పని చేస్తున్నాయి. ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం రిలయన్స్ జియో సహకారంతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, GPT సొల్యూషన్స్‌పై అన్ని రంగాల కోసం భారతదేశ స్వంత భారత్ జీపీటీ (BharatGPT) ని అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తోంది.
సొంత ఓఎస్ కూడా..
భారత్ జీపీటీ తో పాటు, తమ టెలివిజన్ల కోసం రిలయన్స్ జియో తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ను అభివృద్ధి చేసే పనిలో ఉందని ఆకాశ్ అంబానీ వెల్లడించారు. ఈ ఆపరేటింగ్ సిస్టం జియో డివైజ్ లలో యూజర్ ఎక్స్ పీరియన్స్ ను పెంచడంతో పాటు కంపెనీ ఎకోసిస్టమ్ ఆఫ్ సర్వీసెస్ కు దోహదం చేస్తుందన్నారు. మీడియా, వాణిజ్యం, కమ్యూనికేషన్ సహా వివిధ డొమైన్లలో కొత్త ఉత్పత్తులు, సేవలను ప్రారంభించడానికి కంపెనీ కట్టుబడి ఉందని అంబానీ తెలిపారు.