తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Layoff : ఓలా ఎలక్ట్రిక్​లో భారీగా ఉద్యోగాల కోత! అసలు కారణం అదేనా?

Ola Electric layoff : ఓలా ఎలక్ట్రిక్​లో భారీగా ఉద్యోగాల కోత! అసలు కారణం అదేనా?

Sharath Chitturi HT Telugu

Published Nov 22, 2024 12:45 PM IST

google News
    • Ola Electric layoff : పేలవమైన సేల్స్​, సర్వీసింగ్​పై కస్టమర్స్​లో తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ గురించి మరో వార్త బయటకు వచ్చింది. సంస్థలో దాదపు 500మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం.
ఓలా ఎలక్ట్రిక్​లో భారీగా ఉద్యోగాల కోత!

ఓలా ఎలక్ట్రిక్​లో భారీగా ఉద్యోగాల కోత!

ఓలా ఎలక్ట్రిక్​ ఉద్యోగులను ఆందోళనకు గురిచేసే వార్త ఒకటి బయటకు వచ్చింది! దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగంగా లేఆఫ్స్​ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించాలని సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. బిజినెస్ న్యూస్ పబ్లికేషన్ మనీకంట్రోల్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు లాభదాయకతను సాధించే ప్రయత్నాల్లో తన మార్జిన్లను మెరుగుపరచడానికి, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి, త్వరలోనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం 4,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు, సర్వీస్​ పనితీరు సరిగ్గా లేదనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాల కోతకు సంబంధించిన నివేదిక వెలువడటం సర్వత్రా చర్చకు దారితీసింది.

ఈ ఏడాది ఆగస్టులో ఈవీ మేకర్ తన ఐపీఓను లాంచ్ చేసింది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం పెరిగినప్పటికీ ఇటీవలి కాలంలో దాని షేరు ధరలు తగ్గాయి. ఇక నివేదిక ప్రకారం.. వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్​ తన వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టాలని యోచిస్తోంది.

ఉద్యోగుల తొలగింపు వార్తలపై ఓలా ఎలక్ట్రిక్ ఇంకా స్పందించలేదు.

కాగా ఈవీ తయారీ సంస్థ చేపట్టిన తొలి పునర్నిర్మాణ ప్రక్రియ ఇది కాదు. 2022 లో, ఓలా తన యూజ్డ్ కార్ల వ్యాపారాన్ని మూసివేయడంతో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంపై మరింత దృష్టి పెట్టడానికి కూడా లేఆఫ్స్​ చేసింది.

ఓలా ఎలక్ట్రిక్ చుట్టూ వివాదాలు..

పేలవమైన సర్వీస్, ప్రొడక్ట్ ఆరోపణలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దర్యాప్తును ఎదుర్కొంటున్న తరుణంలో ఓలా ఎలక్ట్రిక్​లో ఉద్యోగాల కోతల నివేదిక బయటకు వచ్చింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య విధానాలపై ఓలా ఎలక్ట్రిక్​కి షోకాజ్ నోటీసు జారీ చేసింది.. వినియోగదారుల వాచ్​డాగ్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ). అనంతరం ఈ వ్యవహారంపై విచారణ జరపాలని బీఐఎస్​కి చెప్పింది.

ఓలా ఎలక్ట్రిక్​పై 10,000కు పైగా వినియోగదారుల ఫిర్యాదులను గుర్తించిన సీసీపీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 10,644 కస్టమర్ ఫిర్యాదుల్లో 99 శాతానికి పైగా పరిష్కరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ గత నెలలో పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ, ఫౌండర్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. "ఇందులో మూడింట రెండు వంతులు వాస్తవానికి లూజ్ పార్ట్స్ లేదా సాఫ్ట్​వేర్​ గురించి కస్టమర్స్​కి అవగాహన లేకపోవడం వంటి కారణాలు," అని అన్నారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ వాదనలతో సీసీపీఏ సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు!