Electric Scooter : మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లుక్ అదిరిపోయింది.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ!-vlf tennis electric scooter enter in indian market with 130 km range know this ev price and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లుక్ అదిరిపోయింది.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ!

Electric Scooter : మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లుక్ అదిరిపోయింది.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ!

Anand Sai HT Telugu
Nov 21, 2024 05:31 AM IST

Electric Scooter : మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. దానిపేరు వీఎల్ఎఫ్ టెన్నిస్. లుక్ పరంగా అదిరిపోయిందనే చెప్పాలి. మరి ఫీచర్లు ఏంటో చూసేద్దాం..

వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్
వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. దీనితో కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో స్కూటీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500W ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.29 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఈ ఇటాలియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో స్థానికంగా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ వెలోసిఫెరో(VLF) అనేది KAW వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినది. వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో వస్తుంది,

అయితే భారతదేశంలో మాత్రం ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ 2.5 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఇంజన్ 157 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 65 కి.మీ. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 130 కి.మీ వరకు వెళ్తుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి మూడు గంటలు పడుతుంది. వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500W ఎలక్ట్రిక్ స్కూటర్ స్నోఫ్లేక్ వైట్, ఫైర్ ఫ్యూరీ డార్క్ రెడ్, స్లేట్ గ్రే కలర్ ఆప్షన్‌లలో దొరుకుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీతో సహా 88 కిలోల బరువు ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు, వెనక భాగంలో డిస్క్ బ్రేక్ ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సస్పెన్షన్ సెటప్ గురించి చూస్తే.. స్కూటర్ ముందువైపు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, వెనక వైపున హైడ్రాలిక్ మోనో షాక్ అబ్జార్బర్ సెటప్ ఉన్నాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు అంగుళాల డిజిటల్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వీఎల్ఎఫ్ టెన్నిస్‌కు స్పీడోమీటర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి.

మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత శక్తివంతమైన 4000W వేరియంట్‌లో వస్తుంది. ఈ వెర్షన్ 232 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం 100 కి.మీ. ఇది కొంచెం పెద్ద 2.8 kWh బ్యాటరీని కలిగి ఉంది. 40 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఇది 100 కి.మీ రేంజ్ అందిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఐదు నుండి ఆరు గంటల సమయం కావాలి. వీఎల్ఎఫ్ టైర్-1, టైర్-2 నగరాల్లో 15 డీలర్‌షిప్‌లను ప్లాన్ చేస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను 50కి పెంచాలని అనుకుంటోంది.

Whats_app_banner