తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Credit Card Payments: ఇక క్రెడ్, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎం లతో క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయలేరు

Credit card payments: ఇక క్రెడ్, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎం లతో క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయలేరు

HT Telugu Desk HT Telugu

03 July 2024, 18:06 IST

google News
  • చాలా మంది క్రెడిట్ కార్డ్ యూజర్లు తమ క్రెడిట్ కార్డు బిల్లులను థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్ అయిన క్రెడ్, పేటీఎం, అమేజాన్ పే వంటి వాటితో చెల్లిస్తుంటారు. వాటితో పే చేయడం వల్ల క్యాష్ బ్యాక్స్ లేదా రివార్డ్స్ పొందుతుంటారు. కానీ, ఇకపై అన్ని బ్యాంక్ ల క్రెడిట్ కార్డు బిల్లులను అలా చెల్లించడం కుదరదు.

 క్రెడిట్ కార్డ్ పేమెంట్స్
క్రెడిట్ కార్డ్ పేమెంట్స్

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్

Credit card payments: క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు మార్పులు చేసింది. ఈ మార్పులు జూలై 1 నుండి అమలులోకి వచ్చాయి. థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా జరిగే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులన్నీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారా జరగాలని ఆర్బీఐ తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లు క్రెడ్, ఫోన్ పే , అమెజాన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లను ఉపయోగించి తమ బిల్లులను సెటిల్ చేసుకునే అవకాశం ఇకపై ఉండదు. ఈ బ్యాంకింగ్ సంస్థలు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ప్లాట్ ఫామ్ తో ఇంకా అనుసంధానం కానందువల్ల వాటిద్వారా క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు కుదరవని ఆర్బీఐ తెలిపింది.

బీబీపీఎస్ ప్లాట్ ఫామ్ అంటే ఏమిటి?

వ్యాపారాలు, వినియోగదారుల కోసం పేమెంట్స్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి అధునాతన సాంకేతిక పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతో ఆర్బీఐ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ను అభివృద్ధి చేసింది. బ్యాంక్ బ్రాంచీలు, కలెక్షన్ స్టోర్స్ వంటి అవుట్ లెట్స్ నెట్వర్క్ ద్వారా, అలాగే యాప్స్ లేదా వెబ్ సైట్ల వంటి వివిధ డిజిటల్ ఛానల్స్ ద్వారా వినియోగదారులు సౌకర్యవంతంగా చెల్లింపులు చేయడానికి బీబీపీఎస్ వీలు కల్పిస్తుంది. ఈ సిస్టమ్ ద్వారా సత్వర సెటిల్ మెంట్ సాధ్యమవుతుంది.

జూలై 1, 2024 నాటికి ఏ బ్యాంకులు బీబీపీఎస్ లైవ్ లో ఉన్నాయి?

జూలై 1, 2024 నాటికి బీబీపీఎస్ లైవ్ లో ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సారస్వత్ బ్యాంక్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ లు బీబీపీఎస్ కు అనుసంధానం కావడంపై కసరత్తు చేస్తున్నాయి.

తదుపరి వ్యాసం