Stock Market : నాలుగేళ్ల కిందట ఈ స్టాక్‌లో లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు కోటి రూపాయలు
07 October 2024, 17:00 IST
- Transformers and Rectifiers India : ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా స్టాక్ ధర గత నాలుగేళ్లలో రాకెట్‌లా దూసుకెళ్లింది. ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టాయి. గతంలో లక్ష రూపాయలు పెట్టినవారికి కోటి రూపాయల రాబడి వచ్చింది.
స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన రోజే ధనవంతులు కావాలంటే కుదరని పని. ఓపికతో స్టాక్ పనితీరును పరిశీలిస్తూ ఉండాలి. అందుకే దీని గురించి ఓ సామెత కూడా ఉంది. రోమ్‌ను ఒక్క రోజులో నిర్మించలేదు, స్టాక్ ఇన్వెస్టర్ రాత్రికి రాత్రే ధనవంతుడు కాలేడు.. అనే మాట ఎక్కువగా వాడుతుంటారు. పెట్టుబడిదారుడు కొన్ని రోజులు వేచి ఉంటే స్టాక్ మార్కెట్ నుంచి మంచి లాభం పొందవచ్చు. స్టాక్ కొనుగోలు చేయడం గెలుపు కాదు.. దానికోసం వేచి ఉండటమే నిజమైన విజయం.
దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈ విషయం బాగా తెలుసు. ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా షేర్లలో పెట్టుబడి పెట్టినవారికి ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ఏప్రిల్ 9, 2020 నుండి రాకెట్‌లా దూసుకెళ్తోంది. నాలుగేళ్ల కిందట షేరు ధర రూ.6.5 కాగా నేడు రూ.680కి చేరింది. అంటే ఈ స్మాల్-క్యాప్ పెన్నీ స్టాక్ దాదాపు నాలుగు సంవత్సరాలలో భారతీయ స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటిగా నిలిచింది.
ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ షేర్ ధర ప్రస్తుతం బీఎస్‌ఇలో రూ.660గా ఉంది. గత ఐదు రోజుల్లో ఈ షేరు 6.45 శాతం లాభపడింది. అదే సమయంలో ఒక నెలలో షేరు 4.36 శాతం పడిపోయింది. ఆరు నెలల అడ్వాన్స్ 40.20 శాతం. ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ స్టాక్ కూడా 2024లో ఇప్పటివరకు 176.50 శాతం లాభపడింది.
గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 297 శాతం పెరిగింది. అంటే ఏడాదిలో షేరు ధర రూ.172 నుంచి రూ.680కి ఎగబాకింది. ఏప్రిల్ 9, 2020న ఈ స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ బీఎస్‌ఈలో దాదాపు రూ. 6.50కి అందుబాటులో ఉండేది. నాలుగు సంవత్సరాలలో ఒక్కొక్కటి రూ.6.50 నుండి రూ.680కి పెరిగింది. దాదాపు 10,350 శాతం వృద్ధి సాధించిందన్న మాట.
ఒక ఇన్వెస్టర్ 6 నెలల క్రితం ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు దాని విలువ రూ.1.45 లక్షలు అవుతుంది. ఈ మల్టీబ్యాగర్ ఏడాది క్రితం రూ.లక్ష పెన్నీ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం రూ.4 లక్షలు అయ్యేది. ఏప్రిల్ 2020లో పెట్టుబడి పెట్టి ఉంటే.. రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పటికి రూ. 1.04 కోట్లకు చేరుకుంది.
పవర్, ఫర్నేస్, రెక్టిఫైయర్ ట్రాన్స్‌ఫార్మర్‌లను తయారు చేస్తున్న భారతీయ కంపెనీ ఇది. కంపెనీ దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేస్తుంది. 5 kV నుండి 1,200 kV వరకు వోల్టేజ్ రేంజ్, 0.5 MVA నుండి 500 MVA వరకు సామర్థ్యాలతో కూడిన ట్రాన్స్‌ఫార్మర్‌ల తయారీ చేస్తుంది.
కంపెనీకి అదానీ రెన్యూవబుల్స్, టాటా పవర్, కెఇసి ఇంటర్నేషనల్, జెఎస్‌డబ్ల్యు, పవర్‌గ్రిడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఎన్‌టిపిసి, సిమెన్స్ ఎనర్జీ, టోరెంట్ పవర్, అనేక ఇతర క్లయింట్లు కూడా ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.8,958 కోట్లుగా ఉంది.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ పనితీరు గురించి మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. నిపుణల సలహా తీసుకోవాలి.