Multibaggar stocks : ఈ టిప్స్ పాటిస్తే.. స్టాక్ మార్కెట్లో 'మల్టీబ్యాగర్' రిటర్నులు మీ సొంతం!
15 January 2024, 12:33 IST
- How to pick a multibaggar stock : స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చారా? 'మల్టీబ్యాగర్ స్టాక్స్' అన్న పదాన్ని ఎక్కువగా వింటున్నారా? మల్టీబ్యాగర్ స్టార్‌ని ఎలా పిక్ చేసుకోవాలి? అని తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఇది మీకోసమే..
ఈ టిప్స్ పాటిస్తే.. స్టాక్ మార్కెట్లో 'మల్టీబ్యాగర్' రిటర్నులు మీ సొంతం!
How to pick multibagger stocks : మల్టీబ్యాగర్ స్టాక్ కోసం చాలా మంది మదుపర్లు అణ్వేషిస్తూ ఉంటారు. వారి కష్టానికి తగ్గట్టే.. సూపర్ రిటర్నులు ఇస్తాయి ఈ తరహా స్టాక్స్. అందుకే వీటికి క్రేజ్ ఎక్కువ! అయితే.. కొన్ని స్టాక్స్‌ని మల్టీబ్యాగర్ అవ్వక ముందే గుర్తించవచ్చు. తద్వారా.. ఎర్లీగా వాటిలో ఇన్వెస్ట్ చేసి, మంచి లాభాలను పొందవచ్చు. అందుకోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..
మోనోపోలి ఉండాలి..
ఓ స్టాక్.. మల్టీబ్యాగర్‌గా మారేందుకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒకటి 'మోనోపోలీ'. ఉదాహరణకు ఐఆర్సీటీసీ స్టాక్‌ని తీసుకుందాము. మార్కెట్లో ఐఆర్సీటీసీకి గుత్తాధిపత్యం ఉంది. ఈ బిజినెస్‌లో ఇతర సంస్థలు ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం. గుత్తాధిపత్యం ఉన్న కంపెనీలు.. మల్టీబ్యాగర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆర్ఓసీఈ కీలకం..
ఆర్ఓసీఈ అంటే.. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఒక్క మాటలో చెప్పాలంటే.. సంస్థలో పెట్టిన మూలధనానికి ఎంత రిటర్న్ వస్తోంది? అనే విషయాన్ని లెక్కించడమే ఆర్ఓసీ. ఆర్ఓసీఈ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఓ కంపెనీ.. ఎప్పటికప్పుడు ఆదాయాన్ని పెంచుకుంటూపోతుంటే.. అది మంచి విషయమే. అయితే.. ఆర్ఓసీఈ తగ్గకుండా.. ఎప్పటికప్పుడు ఆదాయం పెంచుకుంటున్న కంపెనీల షేర్లు.. మల్టీబ్యాగర్లుగా మారే అవకాశం ఉంది.
క్యాష్ ఫ్లో చెక్ చేయండి..
Tips to pick a multibaggar stock : కంపెనీ కార్యకలాపాలను సాగించేందుకు నిధులను ఎంత మేర వాడుతున్నారో చెప్పేదే క్యాష్ ఫ్లో. భవిష్యత్తులో.. కంపెనీకి ఆదాయం పెరుగుతుందా? లేదా? అన్నది ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు చెప్పేస్తాయి. మాటిమాటికి కంపెనీలోకి క్యాష్ ఫ్లో అవుతూ ఉంటే.. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం.. కంపెనీ ఖర్చులకు సరిపోవడం లేదని అర్థం చేసుకోవాలి. అదే జరిగితే.. ఆ కంపెనీ తరచూ అప్పులు చేస్తూ ఉంటుంది. లేకపోతే ఈక్విటీనైనా అమ్ముకోవాల్సి వస్తుంది.
మల్టీబ్యాగర్ కంపెనీలు.. లాభాలతో పాటు ఆపరేటింగ్ క్యాష్‌ఫ్లోలను కాంపౌండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. అంటే, ఎంత తక్కువ ఖర్చులో ఎంత ఎక్కువ రిటర్నులు సంపాదించాలా? అని చూస్తాయి. అందుకే.. భవిష్యత్తులో ఇతర సంస్థల కన్నా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం వీటికి ఉంటుంది.
అయితే.. ఇక్కడ ఒక సమస్య ఉంది. కంపెనీ క్యాష్ ఫ్లోలు, ఆదాయాలు ఎక్కువగానే ఉన్నా.. కొన్నిసార్లు అభివృద్ధి పరంగా అవి నెమ్మదిస్తూ ఉంటాయి(ఉదాహారణకు- కొత్త కస్టమర్లను ఆకట్టుకోలేకపోవడం). వాటిల్లో పెట్టుబడులకు మంచి రిటర్నులు రాకపోవచ్చు.
నిధుల కేటాయింపులు ఎలా ఉన్నాయి?
Stock market investment tips in Telugu : మల్టీబ్యాగర్ కంపెనీలకు అంచనాలకు మించిన ఫ్రీ క్యాష్ ఉంటుంది. అంటే మంచి ఆదాయాలు వస్తున్నాయని అర్థం. ఆర్ఓసీఈ చాలా మెరుగ్గా ఉంటుంది. అదే సమయంలో క్యాష్ ఫ్లోలు కూడా సంస్థ అభివృద్ధికి తగ్గట్టుగానే ఉంటాయి. కానీ ఇలా ఉన్న కంపెనీలన్నీ మల్టీబ్యాగర్లు కాలేవు. దానికి ముఖ్యకారణం.. నిధుల కేటాయింపు.
నిధుల కేటాయింపుతోనే చెడ్డ కంపెనీకి, మంచి కంపెనీకి, మల్టీబ్యాగర్ కంపెనీకి మధ్య ఉన్న వ్యత్యాసం తెలిసిపోతుంది. క్యాష్‌ని సక్రమంగా వినియోగించి మరింత ఆదాయాన్ని జెనరేట్ చేయగలిగే సంస్థలకు మల్టీబ్యాగర్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కంపెనీలు.. పెట్టుబడుల్లో తీసుకునే తప్పుడు నిర్ణయాల కారణంగా డీలా పడుతూ ఉంటాయి. అందుకే.. మిగిలిన విషయాలన్నీ అన్నీ సరిగ్గా ఉన్నా.. మల్టీబ్యాగర్ గుర్తింపు పొందలేకపోతాయి.
ఈ టూల్స్ ఉపయోగపడతాయి..
Multibaggar stocks for 2024 : కంపెనీల పర్ఫార్మెన్స్లను పరిశీలించేందుకు ఆన్లైన్లో అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. అవి మీకు ఉపయోగపడతాయి. వాటిల్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఇక ఒక కంపెనీ మల్టీబ్యాగర్ అయ్యే అవకాశం ఉందని మీకు అనిస్తుంటే, వాటి.. యాన్యువల్ రిపోర్ట్స్, కంపెనీ ప్రెజంటేషన్స్, క్వార్టర్లీ కాన్ఫరెన్స్ కాల్స్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్, వంటి అంశాలను ట్రాక్ చేయడం బెటర్.