KVP Scheme : ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు డబుల్ అవుతాయి
29 July 2024, 13:48 IST
- Postal Schemes In Telugu : డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు పోస్టాఫీస్ ఫథకాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి పథకమే కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ). ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు డబుల్ అవుతాయి.
పోస్టాఫీసు స్కీమ్
కిసాన్ వికాస్ పత్ర కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం కోసం వెతుకుతున్న వారికి ఉత్తమ పోస్టాఫీసు పథకాలలో ఒకటి. ఇది దీర్ఘకాలిక సురక్షిత పొదుపులను ప్రోత్సహించే లక్ష్యంతో 1988లో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభించింది. దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం దీని ప్రాథమిక లక్ష్యం. మొదట్లో రైతుల కోసం మాత్రమే ఉద్దేశించినప్పటికీ, ఇప్పుడు ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
7.5 శాతం వడ్డీ రేటు
కిసాన్ వికాస్ పత్ర అనేది పోస్ట్ ఆఫీస్ అందించే ఉత్తమ చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ప్రస్తుతం కేవీపీలు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలలో ఇది ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటును గతంలో నుండి మార్చలేదు.
గరిష్ట పరిమితి లేకుండా కేవీపీ పథకంలో కనీసం రూ.1000 నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఆ విధంగా 2014లో ప్రభుత్వం రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్లకు పాన్ కార్డును తప్పనిసరి చేసింది. జీతం స్లిప్, ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఆధార్ నంబర్ వంటి కొన్ని పత్రాలను పోస్టాఫీసులో ఇవ్వాలి. సురక్షితమైన పెట్టుబడి ప్రణాళికను కోరుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర ఉత్తమమైన ప్రణాళిక. 18 ఏళ్లు పైబడిన ఎవరైనా ఒకే ఖాతా లేదా ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల పేరుతో ఒక ఖాతాను తీసుకోవచ్చు. ఒక వ్యక్తి అనేక కిసాన్ వికాస్ పత్రాలను కొనుగోలు చేయవచ్చు. ఈ లేఖను సంబంధిత పోస్టాఫీసులో రసీదుగా పొందవచ్చు. సెక్యూరిటీగా తనఖా పెట్టవచ్చు. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. ట్రస్ట్‌లు కూడా డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ప్రవాస భారతీయులు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు.
కిసాన్ వికాస్ పత్రలో ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ వ్యవధికి ముందే పెట్టుబడిని ఉపసంహరించుకోవడం ద్వారా ఖాతాను మూసివేయవచ్చు. కాకపోతే రెండున్నరేళ్ల పెట్టుబడి తర్వాత ఉపసంహరణ ఆప్షన్ కూడా ఉంది. ఖాతా తెరవడానికి ఆధార్ కార్డ్, వయస్సు రుజువు సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, KVP దరఖాస్తు ఫారమ్ కావాలి.
7.5 శాతం వడ్డీ రేటును అందించడం ద్వారా కిసాన్ వికాస్ పత్ర పథకం మీ పెట్టుబడిని 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు చేయడానికి పనికి వస్తుంది. ఉదాహరణకు ఈ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 115 నెలల తర్వాత మెచ్యూరిటీ సమయంలో రూ.10 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు.
కేవీపీ ఆధారంగా రుణం
రుణాలను పొందడానికి మీరు మీ కేవీపీ ప్రమాణపత్రాన్ని బేస్ లేదా సెక్యూరిటీగా వాడుకోవచ్చు. అటువంటి రుణాలకు వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది.
ఈ పథకం కోసం కావాల్సిన పత్రాలు
A. అడ్రస్ ప్రూఫ్
B. బర్త్ సర్టిఫికేట్
C. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు రుజువు.
D. కేవీపీ కోసం సరిగ్గా పూరించిన దరఖాస్తు ఫారమ్
పోస్టాఫీసులో చాలా రకాల స్కీములు ఉంటాయి. చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటి కిసాన్ వికాస్ పత్ర స్కిమ్. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు డబుల్ అవుతాయి.