Bike Mileage Tips : బైక్ ఎక్కువ మేలేజీ ఇచ్చేందుకు ఈ ట్రిక్ పాటించండి.. 100 శాతం పనిచేస్తుంది
08 October 2024, 14:00 IST
- Bike Mileage Tips : బైక్ ఉన్న ప్రతీ ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట.. నా బైక్ మైలేజీ తక్కువ ఇస్తుందని. ఏదో ఒక సమయంలో ఈ మాట అనడం వింటూనే ఉంటాం. కానీ మనం చేసే చిన్న తప్పులే బైక్ మైలేజీ తగ్గేందుకు కారణాలు.
బైక్ మైలేజీ టిప్స్
బైక్ ఉన్న వారికి ఒక సాధారణ ఫిర్యాదు మైలేజ్ సమస్యలు. సమయానికి బైక్‌ను సర్వీసింగ్ చేసినా, ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా చక్కగా మెయింటెయిన్ చేసినా బైక్ మైలేజీని బాగా ఇవ్వడం లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే అందులో ప్రత్యేకంగా ఒక కారణం ఉంది. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది తప్పు చేస్తుంటారు.
ఏదైనా బైక్ మైలేజ్ దాని ఇంజిన్ స్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రయాణించే విధానం కూడా మైలేజీని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. బైక్ ఎలా నడుపుతున్నారనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. మీరు బైక్ మైలేజీతో సమస్యలను ఎదుర్కొంటే కొన్ని ట్రిక్స్ పాటించాలి. బైక్‌ను సరైన వేగంతో, ఆర్‌పీఎమ్‌లో నడపడం ద్వారా మాత్రమే కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజీని వస్తుంది. మీకు నచ్చినట్టుగా వేగంగా లేదా మెల్లగా నడిపితే కంపెనీ చెప్పిన ప్రకారం మైలేజీ రాదు. మెరుగైన మైలేజీని పొందడానికి సురక్షితమైన వేగంతో డ్రైవ్ చేయాలి.
చాలా మంది చాలా నెమ్మదిగా లేదా చాలా వేగంగా బైక్ నడుపుతారు. ఈ పొరపాటు వల్ల బైక్‌లు, స్కూటర్‌లకు ఎప్పుడూ తక్కువ మైలేజీ వస్తుంది. ఇది ఇంజన్‌కి ఎక్కువ పనిని ఇస్తుంది. ఈ కారణంగా మైలేజీని తగ్గిపోతుంది. సురక్షితమైన బైక్ వేగం 40-60. ఈ వేగాన్ని పాటిస్తే బైక్ ఇంజిన్ ఉత్తమంగా పనిచేస్తుంది. వాహనాన్ని సరైన వేగంతో నడపడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి పడదు. దాని జీవితకాలం కూడా పెరుగుతుంది.
సేఫ్ స్పీడ్ మెయింటెయిన్ చేస్తే మంచి మైలేజీని ఇస్తాయి. చాలా బైక్‌లకు, సురక్షితమైన వేగం గరిష్ట వేగంలో 40-60 శాతంగా ఉంటాయి. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు బైక్ గరిష్ట వేగం 100 kmph అనుకుంటే.. వేగం 40-60 kmphగా ఉండాలి. ఈ వేగంతో బైక్ నడపడం వల్ల ఇంధనం ఆదా అవడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గుతాయి.
గేర్లను మార్చేటప్పుడు ఎల్లప్పుడూ వేగం గురించి చూసుకోవాలి. చాలా మంది చాలా స్పీడుగా ఉన్నా గేర్లను టక టక మారుస్తూ ఉంటారు. బైక్‌ను అధిక వేగంతో నడిపే సమయంలో గేర్లను మారిస్తే.. ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. లాంగ్ రైడ్ కోసం బయలుదేరే ముందు, బైక్ మాన్యువల్ బుక్‌లో ఇచ్చిన విధంగా మీ బైక్ గరిష్ట వేగం, సురక్షిత వేగాన్ని తెలుసుకోవాలి.
పైన చెప్పిన విషయమే కాకుండా మరికొన్ని అంశాలు కూడా మీ బైక్ మైలేజీని పెంచుతాయి. క్వాలిటీ పెట్రోల్ వాడాలి. ఇంజిన్ ఆయిల్ కూడా రెగ్యూలర్‌గా ఛేంజ్ చేయాలి. ఎయిర్ ఫిల్టర్‌లను క్లీన్ చేయించాలి.