CIBIL score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డు పొందవచ్చు; ఈ మార్గాలు ఉన్నాయి..
30 March 2024, 16:17 IST
CIBIL score: దాదాపు అన్ని బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇవ్వడానికి సిబిల్ స్కోర్ ను ప్రామాణికంగా తీసుకుంటాయి. అంతేకాదు, క్రెడిట్ కార్డ్ లను జారీ చేయడానికి కూడా మంచి సిబిల్ స్కోర్ ఉండడం కీలకం. తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే సాధారణంగా క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి నిరాకరిస్తారు.
ప్రతీకాత్మక చిత్రం
credit card tips: సాధారణంగా సిబిల్ స్కోర్ (Credit Information Bureau India Limited - CIBIL) ను పరిశీలించిన తరువాతనే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తారు. అలాగే, క్రెడిట్ కార్డ్ ల జారీకి కూడా సిబిల్ స్కోర్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. సిబిల్ స్కోర్ బాగా ఉంటే, మీరు మీ రుణాలను సకాలంలో చెల్లించగలరన్న విశ్వాసం బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలకు కలుగుతుంది. అయితే, సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోయినా.. క్రెడిట్ కార్డ్ పొందవచ్చు. అందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటంటే..
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు సరైన సిబిల్ స్కోర్ లేని లేదా క్రెడిట్ హిస్టరీ లేని వ్యక్తులు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు పొందాలంటే, మీ క్రెడిట్ లిమిట్ కు సమాన మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్ ను అందించాల్సి ఉంటుంది. అంటే, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పొందే క్రెడిట్ లిమిట్ కు అంతే మొత్తంలో మీరు పూచికత్తు అందిస్తున్నారన్న మాట. సెక్యూర్డ్ క్రెడిట్ ఉన్నందువల్ల క్రెడిట్ కార్డ్ ను జారీ చేసే సంస్థకు రిస్క్ తక్కువగా ఉంటుంది. అందువల్ల, సిబిల్ స్కోర్ (CIBIL score) తక్కువగా ఉన్నప్పటికీ మీకు క్రెడిట్ కార్డ్ ను జారీ చేస్తారు.
అధిక వడ్డీ రేట్లతో క్రెడిట్ కార్డులు
కొన్ని బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు తక్కువ క్రెడిట్ స్కోర్లు (credit score) ఉన్న వ్యక్తులకు కూడా క్రెడిట్ కార్డు (credit card) లను అందిస్తాయి. కానీ వాటికి అన్ని రుసుములు కూడా అధికంగానే ఉంటాయి. అంటే, అధిక వడ్డీ రేట్లు, వార్షిక రుసుములు, ప్రాసెసింగ్ ఫీజులు.. అన్నీ ఎక్కువగానే ఉంటాయి. వీటి నిర్వహణ ఖర్చుతో కూడుకున్నదై ఉంటుంది. అందువల్ల, ఇలాంటి ఆప్షన్స్ తో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు సాధారణ క్రెడిట్ కార్డులు పొందలేని పరిస్థితి ఉంటే, క్రెడిట్ కార్డ్ మీకు అత్యవసరమైతే, ఈ ఆప్షన్ ను పరిశీలించవచ్చు.
చిన్న బ్యాంకు కార్డులు
క్రెడిట్ కార్డుల జారీకి పెద్ద బ్యాంకులు కఠినమైన నిబంధనలు అమలు చేస్తాయి. సిబిల్ స్కోర్ ను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాయి. కానీ, చిన్న బ్యాంకులు లేదా క్రెడిట్ యూనియన్లు క్రెడిట్ కార్డ్ ల జారీకి కఠినమైన నిబంధనలు పెట్టవు. సిబిల్ స్కోర్ కన్నా.. తిరిగి చెల్లించగలరా? అన్న విషయాన్ని పరిశీలిస్తాయి.
కో-సైనర్లతో క్రెడిట్ కార్డులు
మీ క్రెడిట్ హిస్టరీ బాగా లేకపోయినా, మీ కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడి సిబిల్ స్కోర్ బాగా ఉంటే, ఆ వ్యక్తిని కో - సైనర్ (co-signers) గా తీసుకుని క్రెడిట్ కార్డ్ (credit card) కు అప్లై చేసుకోవచ్చు. ఆ కో సైనర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా మీకు క్రెడిట్ కార్డ్ ను జారీ చేస్తారు. కానీ, మీరు తిరిగి చెల్లించే సమయంలో తప్పులు చేస్తే, మీ క్రెడిట్ స్కోర్ తో పాటు, ఆ కో సైనర్ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది.
ఈ సూచనలు పాటించండి
మంచి సిబిల్ స్కోర్ పొందాలంటే, సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం. తిరిగి చెల్లించగలం అన్న విశ్వాసం ఉన్నప్పుడే రుణం తీసుకోవడం ఉత్తమం. అలాగే, సకాలంలో చెల్లింపులు చేయడం, బకాయి ఉన్న రుణాన్ని క్రమంగా తగ్గించుకోవడం ముఖ్యం. దాంతో, కాలక్రమేణా మీ క్రెడిట్ స్కోరు (credit score) ను మెరుగుపడుతుంది.