Honor X9b launch: అల్ట్రా బౌన్స్ డిస్ ప్లే తో ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన హానర్
15 February 2024, 17:28 IST
Honor X9b launch: సర్టిఫైడ్ డ్రాప్ రెసిస్టెన్స్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ తో అల్ట్రా బౌన్స్ డిస్ ప్లే వంటి ఫీచర్లను అందించే హానర్ ఎక్స్9బీ భారత్ లో లాంచ్ అయింది. ఈ లేటెస్ట్ 5 జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హానర్ ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్
ఎన్నో నెలల నిరీక్షణ తర్వాత హానర్ ఎక్స్9బీ భారత్ లో లాంచ్ అయింది. ఇప్పటికే భారత మార్కెట్లో హానర్ 90తో పాటు పలు ఇతర స్మార్ట్ ఫోన్లు ఉన్న హానర్ నుంచి వచ్చిన తాజా స్మార్ట్ ఫోన్ ఇది. హానర్ ఎక్స్ 9బి ఫీచర్లలో అల్ట్రా-బౌన్స్ 360-డిగ్రీ యాంటీ డ్రాప్ డిస్ ప్లే ముఖ్యమైనది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ 3 రోజుల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు ఛాయిస్ వాచ్, ఇయర్ బడ్స్ ఎక్స్ 5లను కూడా హానర్ లాంచ్ చేసింది.
హానర్ ఎక్స్9బీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ హానర్ ఎక్స్9బీ (Honor X9b) స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల 1.5 కే AMOLED డిస్ ప్లే ఉంది. అల్ట్రా-బౌన్స్ 360-డిగ్రీ యాంటీ-డ్రాప్ డిస్ ప్లే గా హానర్ దీనిని మార్కెట్ చేస్తుంది. ఇది ఎస్జీఎస్ 5-స్టార్ హోల్-డివైజ్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ పొందింది. ఇందులో 4ఎన్ ఎం ప్రాసెస్ లో రూపొందిన క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్ ను అమర్చారు. ఇందులో 16 జీబీ LPDDR4X ర్యామ్ (8 జీబీ ర్యామ్ +8 జీబీ ర్యామ్ టర్బో), 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై హానర్ ఎక్స్9బీ పనిచేస్తుంది.
ట్రిపుల్ కెమెరా సెటప్
ఈ Honor X9b స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ను అందించారు. హానర్ ఎక్స్9బీలో 5800 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ బ్యాటరీ 3 రోజుల వరకు పనిచేస్తుందని, 3 సంవత్సరాల యాంటీ ఏజింగ్ లక్షణాలతో వస్తుందని హానర్ పేర్కొంది.
Honor X9b: ధర మరియు లభ్యత
హానర్ ఎక్స్ 9బి (Honor X9b) 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఇది మిడ్ నైట్ బ్లాక్, సన్ రైజ్ ఆరెంజ్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. హానర్ ఎక్స్9బీ ధర మన దేశంలో రూ.25,999 గా ఉంది. ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ.3000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ బోనస్ గా రూ .5000 తగ్గింపును కూడా హానర్ అందిస్తోంది. అలాగే, రూ.2999 విలువైన హానర్ ప్రొటెక్ట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ ను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా హానర్ ఎక్స్9బీ కొనుగోలుదారులకు 6 నెలల పాటు వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ తో పాటు 30 రోజుల బై బ్యాక్ ఆప్షన్ లభిస్తుంది.