హోండా యాక్టివా ఈవీకి పోటీనిచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యేది అప్పుడేనా?
18 November 2024, 17:30 IST
- Electric Scooter : మార్కెట్‌లోకి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటీ వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి ప్రధాన పోటీగా భావించే సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.
సుజుకి యాక్సెస్
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియాకు మంచి పేరు ఉంది. ఈ కంపెనీ టూ వీలర్స్‌కు డిమాండ్ ఉంది. దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న యాక్సెస్ 125 ప్రముఖ స్కూటర్‌గా పేరు తెచ్చుకుంది. అధిక సంఖ్యలో అమ్ముడవుతోంది. ప్రస్తుతం, కంపెనీ 2025 నాటికి అదే స్కూటర్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొత్త సుజుకి యాక్సెస్ ఈవీ.. త్వరలో లాంచ్ అయ్యే హోండా యాక్టివా ఈవీకి పోటీ ఇవ్వనుంది.
యాక్సెస్ 125తో పాటు సుజుకి కంపెనీ బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్‌ను కూడా విజయవంతంగా విక్రయిస్తోంది. గత 2 సంవత్సరాలుగా ఈ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ అవతార్‌లో విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తోంది. అయితే ఈ బర్గ్‌మన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే ముందే యాక్సెస్ ఈవీ అమ్మకానికి తీసుకురావాలని సుజుకి కంపెనీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సరికొత్త సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1.20 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో 2025లో విడుదల కానుంది.
దేశీయ వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త పెట్రోల్ ఆధారిత సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర కనిష్టంగా రూ. 80,700, గరిష్ట ధర రూ.91,300 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇందులో 124సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 45కేఎంపీఎల్ వరకు మైలేజీ ఇస్తుంది.
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ సెమీ-డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్ అండ్ సుజుకి రైడ్ కనెక్ట్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. 5 లీటర్ ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. రైడర్ సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇది మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్‌తో సహా అనేక రంగులలో అందుబాటులో ఉంది.
సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు బలమైన పోటీదారుగా చెప్పే హోండా యాక్టివా ఈవీ నవంబర్ 27న విడుదల కానుంది. కొత్త యాక్టివా ఈవీ రూ.1 లక్ష నుండి రూ.1.20 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
సరికొత్త హోండా యాక్టివా ఈవీ 1.3 KWh కెపాసిటీ గల డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై 100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వొచ్చు. ప్రయాణీకుల రక్షణ కోసం ఇది డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు సుజుకి యాక్సెస్ 125 ఎలక్ట్రిక్ మోడల్‌పై కూడా కస్టమర్లకు అంచనాలు ఉన్నాయి. హోండా యాక్టివా ఈవీకి ప్రత్యర్థి అవుతుంది.